నమస్తే నెట్వర్క్, ఆగస్టు 10 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్, మతతత్వ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సోమవారం జరిగిన జైల్‌భరో కార్యక్రమం ఉమ్మడి ఖమ్మంజిల్లాలో విజయవంతమైంది. సంయుక్త కిసాన్ మోర్చా, సంయుక్త వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, భారీ ప్రదర్శనలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో ఉమ్మడి ఖమ్మంజిల్లా దద్దరిల్లింది. ‘క్విట్ ఇండియా’ ఉద్యమస్ఫూర్తితో ఆందోళనలు చేస్తున్న నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలకు మోదీ ప్రభుత్వం దేశ సంపదను దోచిపెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేబర్కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.42 వేలు ఇవ్వాలని, వీబీజీరామ్‌జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని అమలు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్నివర్గాల ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి పాలించే హక్కులేదని, మోదీని గద్దెదించే వరకు పోరాటాలు ఆపేదిలేదని నాయకులు హెచ్చరించారు.