మంగళవారం 31 మార్చి 2020
National - Mar 22, 2020 , 09:52:58

తిరుమల చరిత్రలో ఇదే మొదటిసారి

తిరుమల చరిత్రలో ఇదే మొదటిసారి

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దాదాపు 128 ఏళ్ల తర్వాత భక్తులు కొద్దిరోజుల పాటు దూరం కానున్నారు. వందల ఏళ్ల క్రితం నుంచి గోవిందుడి దివ్యమంగళ స్వరూపాన్ని కోట్లాదిమంది దర్శించుకుని పునీతులవుతున్నారు.  క్రీ.పూ.1వ శతాబ్దంలో తిరుమల కొండపై చీమ లపుట్టతో కప్పబడిన స్వామి విగ్రహాన్ని తెలుగు తొండమాన్ చక్రవర్తి దర్శించి ఆ విగ్రహం చుట్టూ చిన్నమండపాన్ని కట్టించారని చరిత్ర చెబుతోంది. అప్పటివరకు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉన్న మూలమూర్తికి మండపం ఏర్పాటు చేసిన తర్వాత శ్రీనివాసుడు భక్తుల పూజలు అందుకోవటం ప్రారంభమైంది. 

ఆ తర్వాత పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, బ్రిటిష్ పాలకులు, ఆర్కాటు నవాబులు, మహంతులు స్వామిని ఆరాధించి సేవలందించారు.  క్రమేపీ శ్రీవారి వైభవం విశ్వవ్యాప్తి చెంద డంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు దర్శనం నిమిత్తం తిరుమలకు రావడం సంప్రదాయంగా మారింది.  ఎంతోమంది తిరుమల క్షేత్రాన్ని పాలించినప్పటికీ సాయంత్రమైతే దట్టమైన అడవిలో ఉన్న ఆలయం మూగబోవాల్సి వచ్చేది. 

అప్పట్లో అర్చకులు ఉదయాన్నే కొండెక్కి ఆల యాన్ని తెరిచి శుద్ధి అనంతరం నైవేద్యం సమర్పించేవారు.  మధ్యాహ్నం వరకు భక్తులకు దర్శనం కల్పించి చీకటి పడేలోపు తిరిగి వెళ్లిపోయారు.  ఎన్ని ఇబ్బందులున్నా స్వామికి కైంకర్యాలు, భక్తులకు దర్శనం నిలిపి నట్టు చరిత్రలో ఎక్కడా లేదు. 1892లో మాత్రం జీయర్లు, మహంతులకు మధ్య వివాదం కారణంగా రెండు రోజుల పాటు ఆలయాన్ని మూసివేశారు.  ఆ సందర్భంలో స్వామి కనీస నైవేద్యాలు, పూజలకు కూడా నోచుకోలేదని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 

ఆ తర్వాత క్షేత్రాన్ని అభివృద్ధి చేయ డంలో భాగంగా ఆలయం చుట్టూ నివాసాలు ఏర్పాటు చేయాలని 1910లో అప్పటి మహంతులు వివిధ ప్రాంతాల నుంచి జనాల్ని రప్పించి ఉద్యో గాలు ఇవ్వడంతో పాటు వ్యాపారాలు, ఇళ్ల కోసం భూములు లీజుకి ఇచ్చారు. దాంతో తిరుమల పట్టణంగా మారడంతో రాత్రిపూట బసచేసే భక్తుల సంఖ్య కూడా పెరింది.  ప్రస్తుతం చంద్ర, సూర్యగ్రహణ సందర్భాల్లో మాత్రమే తాత్కాలికంగా కొన్ని గంటల పాటు ఆలయాన్ని మూసివేస్తు న్నారు. 

అలాగే 1975-80 వరకు మాడవీధుల వెంబడి ఉన్న ఇళ్లలో ఎవ రైనా చనిపోతే శవాన్ని తీసుకెళ్లే సందర్భాల్లో మాత్రమే ఆలయాన్ని కొన్ని గంటలు మూసివేసి, దర్శనాన్ని రద్దు చేసేవారు.  1958 నుంచి 1970, 1982, 1994, 2006 అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువు సమయంలో కూడా భక్తుల సంఖ్య తక్కువగానే ఉన్నా, దర్శనం రద్దులాంటి నిర్ణయాలు తీసుకోలేదు. 

2018 ఆగస్టు మహాసంప్రోక్షణ సమయంలో దర్శనాన్ని రద్దు చేయాలని తొలుత నిర్ణయం తీసుకున్నప్పటికీ భక్తులు నుంచి విమర్శలు రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని పరిమిత సంఖ్యలో దర్శనానికి అనుమతించారు. ఇప్పుడు కరోనా వైరస్ నేపథ్యంలో భక్తుల ఆరో గ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయంతో వారంరోజుల పాటు శ్రీవారికి భక్తులు దూరం కానున్నారు.తిరుమల చరిత్రలో ఆలయం తెరిచి ఉన్నప్పటికీ దర్శనానికి దూరం కావడం ఇదే మొదటిసారి.


logo
>>>>>>