శనివారం 28 మార్చి 2020
International - Jan 23, 2020 , 02:02:15

ట్రంప్‌ నోట అదే మాట

ట్రంప్‌ నోట అదే మాట
  • కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి సహకరిస్తామని పునరుద్ఘాటన
  • దావోస్‌లో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో సమావేశం

దావోస్‌: కశ్మీర్‌ సమస్య (భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య) ద్వైపాక్షిక అంశమని భారత్‌ పలుమార్లు స్పష్టం చేసినా అమెరికా తన ధోరణిని మార్చుకోవడం లేదు. కశ్మీర్‌ విషయమై భారత్‌, పాకిస్థాన్‌ మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తున్నామని అంటూ ఉభయ దేశాల మధ్య దీర్ఘకాలంగా నెలకొన్న ఆ సమస్యను పరిష్కరించేందుకు సహాయం చేస్తామని మరోమారు వెల్లడించింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మంగళవారం ప్రైవేటుగా భేటీ అయ్యారు. అంతకుముందు వారిద్దరు మీడియాతో మాట్లాడారు. తాము చర్చించబోయే అంశాల్లో వాణిజ్యం, సరిహద్దులు కీలకమైనవని ట్రంప్‌ పేర్కొనగా, ఆఫ్ఘనిస్థాన్‌ తమకు ప్రాధాన్య అంశమని ఇమ్రాన్‌ఖాన్‌ చెప్పారు. 


ఇమ్రాన్‌ను తన స్నేహితుడిగా అభివర్ణించిన ట్రంప్‌ కశ్మీర్‌ సమస్యపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చిస్తానని తెలిపారు. రెండు లేదా మూడు వారాల్లో ట్రంప్‌ తొలిసారిగా భారత్‌లో పర్యటించే అవకాశాలున్నాయి. ‘భారత్‌, పాక్‌ల మధ్య ఏం జరుగుతున్నది.. సహాయం అవసరమైతే, మేము తప్పకుండా ముందుకు వస్తాం. ఉభయ దేశాల మధ్య నలుగుతున్న ఆ సమస్యను పరిశీలిస్తున్నాం. నా స్నేహితుడు (ఇమ్రాన్‌)ను కలుసుకోవడం నాకు గర్వకారణం’ అని ట్రంప్‌ చెప్పారు. ‘భారత్‌తో వివాదం మాకు అతిపెద్ద సమస్య. ఉద్రిక్తతలను సడలించడంలో అమెరికాకు అలవాటైన పాత్రను పోషిస్తుందని ఆశిస్తున్నాం. అమెరికాకు తప్ప మరే ఇతర దేశానికి అది చేతకాదు’ అని ఇమ్రాన్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు. 


logo