BRS | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఐదు నెలల్లోనే బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా పుంజుకున్న వైనంపై ‘ది స్టేట్స్‌మెన్’లో ఆసక్తికర కథనం ప్రచురితమైంది. రాజకీయ రణక్షేత్రంలో బీఆర్ఎస్ పడిలేవడంతో లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్, బీజేపీ పెట్టుకున్న ఆశలకు గండిపడిందని విశ్లేషించింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోటీ ఉంటుందనుకున్న స్థానాల్లోనూ బీఆర్ఎస్ రేసులోకి దూసుకొచ్చి త్రిముఖ పోటీగా మార్చిందని పేర్కొన్నది. ‘ది స్టేట్స్‌మెన్’ కథనం ప్రకారం… లోక్‌సభ ఎన్నికల కార్యక్షేత్రాన్ని జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు వదిలిపెట్టకుండా.. పట్టుదల, వ్యూహాత్మక అడుగులతో ఆ రెండు పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇస్తున్నది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, కేసీఆర్ సొంత నియోజకవర్గం మెదక్‌తో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన మహబూబ్‌నగర్‌లో తీవ్ర పోటీ నెలకొన్నది.
లోక్‌సభ సీట్లపై చాలా ఆశలు పెట్టుకున్న అధికార కాంగ్రెస్‌ను, బీఆర్ఎస్ ఓట్లను తమవైపు తిప్పుకొని లబ్ధి పొందాలని బీజేపీ భావించగా, ఆ పార్టీ ఆశలపై బీఆర్ఎస్ గట్టి దెబ్బకొట్టింది. కేసీఆర్ రాజకీయ వ్యూహాలతో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొన్నది. బీజేపీ సిట్టింగ్ స్థానాలైన కరీంనగర్, సికింద్రాబాద్‌తో పాటు కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీకి బీఆర్ఎస్ పార్టీనే గట్టి పోటీ ఇస్తున్నది. బీజేపీ, కాంగ్రెస్‌కు మొగ్గు ఉంటుందనుకున్న స్థానాల్లోనూ ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొన్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎక్కువ మంది మాజీ బీఆర్ఎస్ నాయకులే. పార్టీని నేతలు విడిచిపోతున్న సమయంలో బీఆర్ఎస్ బలహీనపడుతున్నదని అనుకుంటుండగా బీసీలకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కేసీఆర్ పార్టీకి కొత్త బలాన్ని అందించారు. ముఖ్యంగా బీసీ ఓట్లు ఎక్కువ ఉన్న స్థానాలను బీఆర్ఎస్ పార్టీ బీసీలకు కేటాయించింది. ముదిరాజ్‌లు ఎక్కువగా ఉన్న చేవెళ్ల స్థానం నుంచి ముదిరాజ్ సామాజికవర్గ నేత కాసాని జ్ఞానేశ్వర్‌ను పోటీకి నిలిపింది. జహీరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ లింగాయత్ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వగా, కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈ నియోజకవర్గంలో గణనీయ సంఖ్యలో ఉన్న మున్నూరు కాపు సామాజికవర్గ నేతను బరిలో నిలిపింది.
మరోవైపు కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్‌షోలతో జనంలోకి వెళ్లడంతో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న కరెంట్, రైతు సమస్యలు, సాగు, తాగునీటి సమస్యలను కేసీఆర్ లేవనెత్తినప్పుడు జనం నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తున్నది. బస్సుయాత్రలో ఆయన రోడ్డు పక్కన చిన్న చిన్న హోటళ్ల వద్దకు వెళ్లి స్నాక్స్ తింటూ ప్రజలతో మమేకం అవుతున్న తీరుకు వారు ఫిదా అవుతున్నారు. కాగా, రాష్ర్టానికి కాంగ్రెస్, బీజేపీలు చేసిన అన్యాయానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ఈ కథనం ప్రస్తావించింది. ఈ క్రమంలో కేంద్రంలో పదేండ్ల బీజేపీ పాలన, రాష్ట్రంలో ఐదు నెలల కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని ఫలితంగా తమకు 10 నుంచి 12 స్థానాలు రాబోతున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారని ఉటంకించింది.