హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఖాతా నుంచి విశాఖ ఇండస్ట్రీస్‌కు దాదాపు రూ.69 కోట్ల నిధుల బదలాయింపుపై సీఐడీ విచారణ జరుపుతున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. పాత అధ్యక్షుడిని తొలగించడం, కొత్త అధ్యక్షుడిని నియమించడం, కోర్టులో కేసు కొనసాగుతుండగానే.. 22 ఏండ్ల కిందటి ఫైల్‌ను అడ్డం పెట్టుకొని ఉత్తర తెలంగాణకు చెందిన మంత్రి కంపెనీకి ఆగమేఘాల మీద నిధులు బదలాయించడంపై ‘నమస్తే తెలంగాణ’లో కథనాలు ప్రచురితమైన సంగతి తెలిసిందే.
ఇవి అటు ప్రభుత్వంలో, ఇటు క్రీడాలోకంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ కార్యవర్గంలోని కీలక సభ్యులను సీఐడీ అధికారులు విచారిస్తున్నట్టు సమాచారం. నూతన అధ్యక్షుడు, సీఈవో, జాయింట్ సెక్రటరీతోపాటు మరో ఇద్దరు కీలక అధికారులను సీఐడీ అధికారులు విచారించినట్టు తెలిసింది. శుక్రవారం దాదాపు 4 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు, శనివారం ఫైళ్లను పరిశీలించినట్టు సమాచారం. పాత అధ్యక్షుడిని తొలగించి, కొత్త అధ్యక్షుడిని నియమించిన వెంటనే నిధుల బదలాయింపునకు పాల్పడటం వెనుక ఉద్దేశం ఏమిటని అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది.
రూ.69 కోట్లు అప్పనంగా విశాఖ కంపెనీకి అప్పగించడాన్ని ఇప్పటికే తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి తప్పుబట్టారు. నిధులను వెంటనే వెనక్కి తీసుకురావాలని హెచ్‌సీఏ అనుబంధ క్రికెట్ క్లబ్బులు పట్టుబట్టాయి. హెచ్‌సీఏ నిర్వాకానికి వ్యతిరేకంగా వారు జింఖానా గ్రౌండ్లో ధర్నాలు సైతం చేశారు. ఈ నేపథ్యంలోనే సీఐడీ విభాగం రంగంలోకి దిగినట్టు సమాచారం.