Ravi Teja | సినీ పరిశ్రమలో హీరోలు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం సాధారణమే. ముఖ్యంగా గతంలో భూములు, స్థలాల్లో పెట్టుబడులు పెట్టిన పలువురు సినీ ప్రముఖులకు ఇప్పుడు వాటి విలువ భారీగా పెరిగింది. తాజాగా మాస్ మహారాజా రవితేజకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఆస్తి గురించి నటుడు అజయ్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. రవితేజ, అజయ్ ఘోష్ కలిసి నటించిన ‘మాస్ జాతర’ సినిమాకు సంబంధించిన షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని అజయ్ ఘోష్ తాజాగా వెల్లడించారు. ‘ఇరుముడి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన.. రవితేజకు శంకర్పల్లి సమీపంలో భారీ విస్తీర్ణంలో ఓ తోట ఉందని తెలిపారు.
‘మాస్ జాతర’ షూటింగ్ కోసం రైల్వే స్టేషన్ సెట్‌తో పాటు ఇంటి సెట్‌ను కూడా రవితేజకు చెందిన ఆ తోటలోనే ఏర్పాటు చేసినట్లు అజయ్ ఘోష్ చెప్పారు. ఆ తోట దాదాపు 26 ఎకరాల విస్తీర్ణంలో ఉందని ఆయన పేర్కొన్నారు. అజయ్ ఘోష్ చెప్పిన వివరాల ప్రకారం.. రవితేజ ఈ భూమిని చాలా సంవత్సరాల క్రితం కేవలం రూ.12 లక్షలకు కొనుగోలు చేశారట. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతంలో భూముల ధరలు భారీగా పెరగడంతో, ఆ 26 ఎకరాల తోట విలువ వందల కోట్ల రూపాయలకు చేరినట్లు అజయ్ ఘోష్ వ్యాఖ్యానించారు.అయితే ఈ ఆస్తి ప్రస్తుత మార్కెట్ విలువకు సంబంధించి అధికారిక ధ్రువీకరణ ఏదీ లేదు. అజయ్ ఘోష్ ఈ విషయాన్ని సినిమా ఈవెంట్లో తన అనుభవం ఆధారంగా వెల్లడించారు.
ఈ సందర్భంగా రవితేజ వ్యక్తిత్వానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా అజయ్ ఘోష్ పంచుకున్నారు. షూటింగ్ సమయంలో ఓ వ్యక్తి ఆ తోట విలువ గురించి ఆశ్చర్యంగా రవితేజను అడిగినప్పుడు.. ఆస్తుల విషయంలో ఆయన చాలా సింపుల్‌గా స్పందించారని తెలిపారు.‘ఇవన్నీ ఇక్కడే ఉంటాయి.. మనం పోతాం. ఇవన్నీ ఉన్నాయని సంతోషించాలి కానీ మన పని మనం చేసుకోవాలి’ అనే భావనతో రవితేజ సమాధానం ఇచ్చినట్లు అజయ్ ఘోష్ చెప్పారు. ఈ మాటలు విన్నవారికి రవితేజ ఆలోచనా విధానం, ఆస్తులపై ఆయనకున్న దృక్పథం మరింత ఆసక్తిని కలిగించాయి. సినిమా రంగంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న రవితేజ.. తన కెరీర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగానూ పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. కెరీర్ ప్రారంభం నుంచే సంపాదించిన మొత్తాన్ని సరైన సమయంలో భూములు, ఇతర ఆస్తుల్లో పెట్టుబడిగా పెట్టారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంటుంది.