Sircilla | సీఎం సారూ.. మా ఊరి పిల్లలకు ఓ బడి భవనం మంజూరు చేయండి” అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కొలనూర్‌కు చెందిన దాసరి నరేష్, గాజుల శ్రీనివాస్ కోరారు. సిరిసిల్ల పర్యటనకు వస్తున్న సీఎంకు పోస్ట్‌కార్డు ద్వారా తమ గ్రామ పాఠశాల దుస్థితిని తెలియజేశారు.
ఆరేండ్లుగా హామీలకే పరిమితమైన కొత్త హైస్కూల్ భవన నిర్మాణాన్ని ఇకనైనా పట్టాలెక్కించాలని విజ్ఞప్తి చేశారు. పాత స్కూల్ బిల్డింగ్ ఎప్పుడు కూలుతుందో తెలియక ఉపాధ్యాయులు,విద్యార్థులు భయంతో బిక్కుబిక్కుమంటూ విద్యాభ్యాసం సాగిస్తున్నారని ప్రమాదకరంగా మారిన ఓల్డ్ స్కూల్ బిల్డింగ్‌ను వెంటనే కూల్చేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రికి యువకులు మొరపెట్టుకున్నారు.
కొలనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం సుమారు 4 దశాబ్దాల ఏళ్ల క్రితం నిర్మించారు. శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారడంతో గత ఐదేళ్లుగా వినియోగానికి దూరమైంది. దీంతో 90 మందికి పైగా విద్యార్థులు రేకుల షెడ్లలోనే చదువుకుంటున్నారు. కొలనూర్తోపాటు మర్తన్నపేట, గొల్లపల్లి, రామన్నపేట గ్రామాల విద్యార్థులకు ఈ పాఠశాలే ఆధారం. వేసవిలో రేకుల షెడ్లు భరించలేని వేడితో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సౌకర్యాల లేమితో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల వైపు మళ్లుతుండటంతో పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. ప్రభుత్వ బడిలో చదవాల్సిన పిల్లలు.. భవనం లేక ప్రైవేటు బాట పట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
కొత్త భవనం నిర్మిస్తామని పలుమార్లు హామీలు ఇచ్చినా ఇప్పటివరకు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని యువకులు ఫిర్యాదు చేశారు. ఒకటో, రెండో గదులు అంటూ ఊరిస్తూ కాలం ఎల్లదీస్తూన్నారని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాత భవనాన్ని తొలగించి, అన్ని వసతులతో కొత్త ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని మంజూరు చేసి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని సీఎంను కోరారు.
దశాబ్దకాలంగా కొలనూర్–చిన్న బోనాల గ్రామాలకు శాశ్వత రోడ్డు కోసం పోరాడుతున్నాం. కొలనూర్–చిన్నబోనాల గ్రామాలను కలిపే సుమారు 800 మీటర్ల రహదారి దెబ్బతిని రాకపోకలకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. ఈ రహదారిని తారు రోడ్డుగా అభివృద్ధి చేయాలని కూడా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. వేములవాడ – సిరిసిల్ల నియోజకవర్గాలను కలిపే ఈ వ్యూహాత్మక రోడ్డు మార్గం అభివృద్ధి చేస్తే వేలాది మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు.
బడి భవనం కోసం అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యాం. ఈనెల 30న రేవంత్ రెడ్డి తొలిసారిగా సిరిసిల్లకు వస్తున్నారని తెలిసి ఆయన దృష్టికి తేవాలనుకున్నాం. అందుకే స్వయంగా తనకే మా గ్రామ బడి సమస్యను ఆయనకు తెలియజేయాలని భావించి పోస్ట్ కార్డు ద్వారా తెలియజేశాను.
– దాసరి నరేశ్, కొలనూర్
విద్యార్థులు ప్రమాదంబారిన పడకుండా ఉండేందుకు వెంటనే దెబ్బతిన్న స్కూల్ బిల్డింగ్‌ను కూల్చాలి. రేకుల షెడ్డులలో తరగతుల నిర్వహణతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉక్కపోత, ఎండ వేడి తట్టుకోలేక తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. అన్ని వసతులతో కొత్త బడి భవనం సాధ్యమైనంత త్వరగా నిర్మించి ఐదారేండ్లుగా రేకుల షెడ్లలో సాగుతున్న విద్యకు ముగింపు పలకాలి
– గాజుల శ్రీనివాస్, కొలనూర్