పులికాంత గంగాధరయ్య బహుముఖ ప్రతిభాశాలి
దాదాపు వందేండ్ల కిందటి మాట. సినిమా పరిశ్రమ ప్రారంభమైనప్పటికీ సరైన ప్రదర్శనా సౌకర్యాలు లేని రోజులవి. తెలంగాణ ప్రాంతంలో హరికథలు, యక్షగానాలు, నాటకాలు,తోలుబొమ్మలాటలు, వీధి భాగవతాలు మొదలైన కళా ప్రదర్శనలను ప్రజలు అత్యంత శ్రద్ధాసక్తులతో ఆదరిస్తున్న తరుణం అది. అలాంటి రోజుల్లోనే పద్యాలు, పాటలు, భజన కీర్తనలు, శతకాలు, హరికథలు, యక్షగానాలు, తత్వగీతాలు, నాటకాలు, మేలుకొలుపులు రాసి పండిత పామర జనుల్ని మెప్పించిన ప్రముఖ విద్వత్కవి పులికాంత గంగాధరయ్య.
దాదాపు వందేండ్ల కిందటి మాట. సినిమా పరిశ్రమ ప్రారంభమైనప్పటికీ సరైన ప్రదర్శనా సౌకర్యాలు లేని రోజులవి. తెలంగాణ ప్రాంతంలో హరికథలు, యక్షగానాలు, నాటకాలు,తోలుబొమ్మలాటలు, వీధి భాగవతాలు మొదలైన కళా ప్రదర్శనలను ప్రజలు అత్యంత శ్రద్ధాసక్తులతో ఆదరిస్తున్న తరుణం అది. అలాంటి రోజుల్లోనే పద్యాలు, పాటలు, భజన కీర్తనలు, శతకాలు, హరికథలు, యక్షగానాలు, తత్వగీతాలు, నాటకాలు, మేలుకొలుపులు రాసి పండిత పామర జనుల్ని మెప్పించిన ప్రముఖ విద్వత్కవి పులికాంత గంగాధరయ్య.
తెలంగాణ సాహితీమూర్తులు
క్రీ.శ.1892లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా (నేటి జగిత్యాల జిల్లా)లోని కథలాపూర్ గ్రామంలో నాగయ్య, లింగమ్మ దంపతులకు గంగాధరయ్య జన్మించారు. నటుడిగా, హరికథకుడిగా, పండితకవిగా ఆయన బాగా ప్రసిద్ధి చెందారు. గంగాధరయ్య నాయక పాత్రధారిగా పలు గ్రామాల్లో నాటకాలు ప్రదర్శించేవారు. ఆయన సోదరులు రాజయ్య, చిన్న రాజయ్య ప్రదర్శించే నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించేవారు. గయోపాఖ్యానం, భక్త అంబరీష, కుశలవ, భక్త రామదాసు, లక్షణ పరిణయం, సీమంతినీ పరిణయం, రుక్మిణీ కల్యాణం, శివకుమార నాటకం, కూకద మహారాజు చరిత్ర, హంసధ్వజ నాటకం, చిరుతొండ నాటకం, సావిత్రీ పరిణయం, విరాట్ విశ్వబ్రహ్మం చరిత్ర మొదలైన 20కి పైగా పుస్తకాలు ఆయన రచించారు.
‘తానుబట్టిన పట్టను దలగు కంటే
ప్రాణములు విడుచుటే మేలు పౌరుషాలి
కనఘ ఈ బాలునకు వెరచి యనియు విడచి
రాదగునె వెనుక కిలను రారాజులకును’
లక్షణ పరిణయం నాటకంలో సాంబుని పరాక్రమానికి భయపడి వెనుదిరిగిపోతున్న దుర్యోధనుని ఉద్దేశించి చెప్పిన పద్యమిది. శత్రువు పరాక్రమాన్ని చూసి భయపడి పారిపోవడం కంటే ప్రాణాలు విడువడం మేలు కదా! అందులో రారాజువైన నీకు ఇది తగునా? అని తేట తేట తెలుగు మాటల్లో రాసిన ఈ పద్యం గంగాధరయ్య ప్రతిభకు నిదర్శనం. మృదుమధురమైన గాత్రంతో కీర్తనలు, తత్వగీతాలు, మంగళహారతులను ఆలపించి అందర్నీ పరవశింపజేసేవారు.
‘వారిధు లేడు నింకినను వహ్నిశిఖల్
చలువైన భోగి భూ
భారము మానినన్ శశియు
భాస్కరులున్ తెరవొప్ప దప్పినన్
మేరువు క్రిందు మీదైన మిన్ను
విరింగిన భూమి దొర్లినన్
తారలు వ్రాలినన్ మితియు
దప్పను స్వప్నమునైన కోమలీ’
చిరుతొండ నాటకంలో- ‘ఇలాంటి అసాధ్యమైన కార్యంబులు కింద మీదైనను నేను ఆడిన మాట తప్పను’ అని భర్త తన భార్యతో చెప్పిన మాటలను పై పద్యంలో అత్యంత రమణీయంగా విశ్లేషించారు గంగాధరయ్య.
‘ధన పశు పుత్ర మిత్ర వనితాగృహ
సంపదలెన్ని యైన వెం
టను మరి రావు రావొకటి
డాంబిక వేషమె కాని స్వప్న మం
దున పొడగన్న వస్తువులు
దోచునే మేల్కొని చూసినంత న
య్యను విన నిట్టి సంసరణ
మౌనిజ మార్గమె చూడ మేలగున్’
అస్థిరమైన ధన, పుత్ర, మిత్ర కళత్రాదులతో కూడిన ఈ గృహ సంపదను నమ్మి చెడిపోవడం కంటే భగవంతుని నమ్మి మోక్షమార్గాన్ని పొందడమే ఉత్తమమని పై పద్యంలో తాత్విక బోధన చేశారు గంగాధరయ్య. సంస్కృత పద ప్రయోగంతో శబ్దాలంకార సోయగంతో అద్భుతమైన పాటలు కూడా రాశారు. మచ్చుకు ఈ మంగళహారతి చూద్దాం..
‘సరసిజ దళ నయన మంగళం
కరుణామృత సాగర మునీశ ప్రణుత మంగళం
విరిశరధర! గురు నర కేసరి తరి
ధర ధర ధర కరివర వరద రఘువర!మురాహర!
సురవర వరనుతాంఘ్రీ మంగళం’
గంగాధరయ్య రామాయణ, భారత, భాగవతాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ప్రబంధాలు, కావ్య, వ్యాకరణ, అలంకార శాస్ర్తాలను ఔపోసన పట్టారు. ఆయన గొంతులో ఒక మధుర గంభీరమైన జీర ఉండేది. ఆయన గొంతెత్తి గానం చేస్తే, శ్రోతలు తమ హృదయాల్లో అమృతవర్షం కురిసినట్టుగా భావించేవారు. బహుముఖ ప్రజ్ఞాశాలి పులికాంత గంగాధరయ్య 1980 అక్టోబర్ 3న పరమపదించినా తెలుగు సాహితీలోకంలో చిరంజీవియై వెలుగొందుతూనే ఉంటారు.
తిరునగరి శ్రీనివాసస్వామి
9440369939
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

