అంతా నా ఇష్టం!
టీజీఎస్పీడీసీఎల్లో ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో లేకుండా బదిలీ ప్రక్రియకు సీఎండీ జితేశ్ వీ పాటిల్ శ్రీకారం చుట్టారు.
- ప్రభుత్వ జీవోతో పనిలేదు.. ఇతర సంస్థల మార్గదర్శకత్వం వద్దు
- టీజీఎస్పీడీసీఎల్లో బదిలీల ప్రక్రియపై ఆ అధికారి ఏకపక్ష నిర్ణయం
- తమ నిర్ణయాన్ని ఎవరూ అడ్డుకోలేరంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు
- నామమాత్రంగా విద్యుత్ ఉద్యోగుల యూనియన్ల ప్రతినిధులతో సమావేశం
- లోపాయికారీగా ఇప్పటికే కొన్ని ఫోకల్ పోస్టుల భర్తీ చేసిన వైనం
- నిబంధనలకు విరుద్ధంగా ఇటీవల బదిలీలు జరిగినట్లు ఆరోపణలు
సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): టీజీఎస్పీడీసీఎల్లో ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో లేకుండా బదిలీ ప్రక్రియకు సీఎండీ జితేశ్ వీ పాటిల్ శ్రీకారం చుట్టారు. అయితే బదిలీల వ్యవహారంపై ఉద్యోగ సంఘాల నుంచే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకు విద్యుత్ సంస్థల చరిత్రలో లేనివిధంగా ఒక్క దక్షిణ డిస్కం మాత్రమే బదిలీలు చేయాలని అనుకోవడం, ట్రాన్స్కో, జెన్కో, ఎన్పీడీసీఎల్లతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ నిర్ణయం తీసుకోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం జనవరి చివరివారంలో విద్యుత్ ఉద్యోగుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సంవత్సరం మధ్యలో బదిలీలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాయి.
అప్పట్లో ఆ ధర్నాలో సుమారు 10వేల మంది ఉద్యోగులు పాల్గొని తమ డిమాండ్లను యాజమాన్యానికి తెలిపారు. అయితే ఈసారి బదిలీల విషయంలో యూనియన్ల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకుండా ముందుగానే ఒక పక్కా ప్రణాళికతో సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి వారు కోరుకున్న విధంగా లాంగ్ స్టాండింగ్ కాలపరిమితిని రెండేండ్ల నుంచి మూడేండ్లకు పెంచడం ద్వారా వారిని సంతృప్తి పరిచారు. జనవరిలో ధర్నాకు ప్రధాన కారణం బదిలీలను సంవత్సరం మధ్యలో చేస్తే తమకు చాలా ఇబ్బందిగా ఉంటుందని, విద్యాసంవత్సరం మధ్యలో తమను బదిలీ చేస్తే తమ కుటుంబాలు, పిల్లల చదువులు ఆగమైపోతాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
కానీ ఇప్పుడు డిసెంబర్ 21 వరకు బదిలీల ప్రక్రియ ముగించేలా పూర్తిస్థాయి షెడ్యూల్ను సీఎండీ వివరించడంతో ఉద్యోగ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బదిలీల ప్రక్రియపై రాష్ట్రంలో నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో ఎస్పీడీసీఎల్ ప్రత్యేకంగా బదిలీలు చేపడుతోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకున్నా పర్వాలేదంటూ కీలక అధికారుల సమావేశంలో ముఖ్య అధికారి చెప్పినట్లు తెలిసింది.
ఫోకల్ పోస్టుల విషయంలో చర్చ..!
బదిలీలకు సంబంధించి ఒక వైపు చర్చ మొదలైన సందర్భం కంటే ముందుగానే అంటే ఈ రెండు నెలలలో సుమారు 40మందిని అంతర్గతంగా టీజీఎస్పీడీసీఎల్ యాజమాన్యం బదిలీ చేసింది. వీటిలో చాలావరకు లోపాయికారీ ఒప్పందాలతోనే జరిగాయని పలువురు ఇంజినీర్లు బహిరంగంగానే చెప్పుకొంటున్నారు. ముఖ్యంగా ఏసీబీ కేసుల్లో ఉన్నవారికి ఫోకల్ పోస్టింగులు ఇవ్వకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి మేడ్చల్ జోన్లోని ఒక సర్కిల్లో అవినీతి ఆరోపణల కేసు ఉన్న ఒక ఇంజనీరును నియమించారని, ఇందుకోసం పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోవైపు కొందరు ఇంజనీర్లకు ప్రమోషన్లు ఇచ్చే క్రమంలోనూ నిబంధనలకు నీళ్లొదిలారని, అసలు ఇటీవల జరిగిన బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ లోపభూయిష్టమని పలువురు సీనియర్ అధికారులు అభిప్రాయపడ్డారు. నగరంలోని సౌత్ మినహా అన్ని సర్కిళ్లు ఫోకల్ పోస్టులేనని, అంతేకాకుండా స్టోర్స్ పోస్టులను కూడా ఫోకల్గానే పరిగణించాలంటూ సీఎండీ నిర్ణయించినట్లు తెలిసింది. అయితే చాలా ఫోకల్ పోస్టుల విషయంలో వ్యక్తిగత ఆర్డర్లు ఇచ్చి వారిని గత నెలలోనే నింపిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఆపరేషన్లలో పోస్టింగులు ఎక్కడున్నాయనే చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా ఆపరేషన్ విభాగంలో ఫోకల్ పోస్టులకు డిమాండ్ అధికంగా ఉండగా వాటన్నిటినీ ముందుగానే భర్తీ చేసి ఇప్పుడు బదిలీల ప్రక్రియకు నిర్ణయించినట్లు డిస్కంలో కొందరు అధికారులు మాట్లాడుకుంటున్నారు. అయితే ముందస్తుగానే జాబితా తయారుచేసి అభ్యంతరాలు కోరి ఆ తర్వాత ట్రాన్స్ఫర్లు చేస్తామని చెబుతున్నప్పటికీ ఇందులో ఫోకల్ పోస్టుల విషయంలో కానీ, కొన్ని కీలకమైన ప్రాంతాలకు కానీ డిమాండ్ కొనసాగుతుందని, ఎన్ని మార్గదర్శకాలు వచ్చినా ఆ విషయంలో మాత్రం మార్పు ఉండదని ఒక సీనియర్ విద్యుత్ అధికారి చెప్పారు.
బదిలీలపై ఏకపక్ష నిర్ణయం..!

ఈ దఫా బదిలీల ప్రక్రియపై ఏకపక్ష నిర్ణయం జరిగిన తర్వాత యూనియన్లతో ఎలాంటి సమస్యలు తలెత్తవద్దంటూ పక్కా ప్రణాళిక ప్రకారం వారిని పిలిపించి ఒక సమావేశం పెట్టారంటూ మింట్కాంపౌండ్లో మాట్లాడుకుంటున్నారు. గతంలో వారు చేసిన డిమాండ్లలో కాలపరిమితి విషయంలో సడలింపు ఇచ్చారు. దీంతో యూనియన్ల ప్రతినిధులు కూడా బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. సంవత్సరం మధ్యలో ఇలా బదిలీలు జరగడం కరెక్టు కాదంటూ కొందరు వ్యతిరేకిస్తే తాము ఇప్పుడే చేస్తామని, జూన్, జూలైలలో ట్రాన్స్ఫర్లు చేసేది లేదంటూ ఖరాఖండిగా చెప్పినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే గతంలో బదిలీలు జరిగితే సాధారణంగా అందరికీ కలిపి ఒకటే ఆర్డర్ ఇచ్చేవారని, గత సంవత్సర కాలంగా వ్యక్తిగతంగా ఆర్డర్లు ఇస్తుండడం వెనక ఆంతర్యమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇక విద్యుత్ సంస్థల్లో కీలకమైన ట్రాన్స్కోలో బదిలీ నిబంధనలకు సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చి మార్గదర్శకాలు రూపొందిన తర్వాత ఇతర సంస్థలు అదే మార్గాన్ని అనుసరిస్తాయి. ఇదే విషయాన్ని సమావేశంలో కొందరు లేవనెత్తితే మిగతావారితో నాకు సంబంధం లేదు.. ఇది నా సంస్థ నాఇష్టం అంటూ ఉన్నతాధికారి వ్యాఖ్యానించినట్లు కొందరు చెప్పారు. తన సంస్థలో ట్రాన్స్ఫర్లు తాను చెప్పినట్లే జరగాలని, ఇందులో ఒకరిద్దరు డైరెక్టర్లు, ఒక చీఫ్ ఇంజినీర్ కీలక పాత్ర పోషిస్తున్నారని సంస్థలో హెచ్ఆర్ విభాగానికి సంబంధించిన ఒక కీలక అధికారి చెప్పారు.
అంతేకాకుండా ఆ సీఈ గత బదిలీలలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, డైరెక్టరుకు సంబంధం లేకుండా నేరుగా మరో డైరెక్టరుతో సంబంధం పెట్టుకుని ఆయన చెప్పినట్లుగా ఆర్డర్లు ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ఈ మధ్యకాలంలో ఒక డైరెక్టరు ఈ విషయంలో అసహనం వ్యక్తం చేసి లీవులో వెళ్లినట్లు కూడా సమాచారం. ఆ తర్వాత డైరెక్టర్ల మధ్య గ్రూపులు అయ్యాయి. తనకు నచ్చిన వారికి ఇష్టమొచ్చినచోట పోస్టింగులు ఇప్పించుకున్న సీఎండీకి అతి సమీపంగా ఉంటూ ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తున్న ఒక కీలక డైరెక్టర్ తాజా బదిలీల ప్రక్రియలోనూ కీలక పాత్ర పోషించనున్నట్లు డిస్కంలో ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

