చంద్రుడి వెలుగుల్లో కాలజ్ఞానం
కార్తిక మాసం వచ్చిందంటేనే తెల్లవారుజామున నదీస్నానాలు, సాయంత్రం వేళ దీపారాధనలు, శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, జ్వాలా తోరణాలు, తులసి కల్యాణాలు, ఉసిరి పూజలు, వనభోజనాలు.. ఎటు చూసినా ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది.
- మంగళవారం కార్తిక పౌర్ణమి
ఆకాశమంతా వెన్నెల పరుచుకుంటుంది. నదీతీరాల్లో దీపాల వరుసలు వెలుగులు విరజిమ్ముతాయి. ఆలయాల్లో ఘంటానాదాలు మారుమోగుతాయి. ఎక్కడ చూసినా శివనామస్మరణ, హరినామ సంకీర్తన.. భక్తితో నిండిన హృదయాలు ప్రకృతితో మమేకమై ఒక పవిత్రమైన వేడుకలో భాగమయ్యే అపురూప సందర్భం కార్తిక పౌర్ణమి. భక్తిని ఒక ఆచారంగా కాకుండా జీవన విధానంగా మార్చుకోవాలని చెప్పే పవిత్ర పర్వదినం ఇది.
కార్తిక మాసం వచ్చిందంటేనే తెల్లవారుజామున నదీస్నానాలు, సాయంత్రం వేళ దీపారాధనలు, శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, జ్వాలా తోరణాలు, తులసి కల్యాణాలు, ఉసిరి పూజలు, వనభోజనాలు.. ఎటు చూసినా ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది. వీటన్నిటితో పాటు చంద్రుడిని ఆరాధించడం మన సంప్రదాయం.. చంద్రుడి గమనాన్ని చూసి కాలాన్ని అర్థం చేసుకోవడం విజ్ఞానం. ఆకాశంలో నిండుగా వెలిగే చంద్రుడి వెన్నెల వెలుగుల్లో కార్తిక పౌర్ణమి నాడు కనిపించే ప్రతీ ఆధ్యాత్మిక దృశ్యం ఎంతో శోభాయమానంగా ఉంటుంది. పున్నమి వేళ ఆకాశమంతా వెన్నెల కాంతులు భూమిపై ప్రసరించి ప్రకాశిస్తుంటే ఆలయాలు, నదీతీరాలతో పాటు ప్రతి లోగిలీ దీపకాంతులతో దేదీప్యమానంగావెలిగిపోతుంది.
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో కార్తిక పౌర్ణమి ఒక విశిష్టమైన పర్వదినం. శైవ సంప్రదాయంలో దీనిని త్రిపురారి పౌర్ణమిగా కూడా పిలుస్తారు. మహాభారతంలోని కర్ణపర్వంలోనూ, శివపురాణ సంప్రదాయంలోనూ ఈ పండుగ ప్రస్తావన ఉంది. తారకాసురుడి కుమారులైన తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి ముగ్గురూ బ్రహ్మదేవుని అనుగ్రహంతో మూడు పురాలను నిర్మించుకున్నారు. బంగారం, వెండి, ఇనుములతో నిర్మించిన ఈ మూడు పురాలు ఒక నిర్దిష్ట సమయంలో ఒకే రేఖలోకి వచ్చినప్పుడు మాత్రమే వాటిని నాశనం చేయగలిగేలా వరం పొందారు. వరబల గర్వంతో విర్రవీగుతున్న ఈ అసురులను సంహరించాలంటూ దేవతలు చేసిన ప్రార్థన మేరకు మహాదేవుడు ఒకే బాణంతో ఈ మూడు పురాలను దహనం చేశాడు. అందుకే ఆయనకు త్రిపురాంతకుడు, త్రిపురారి అనే పేర్లు వచ్చాయి. త్రిపురాసురుల సంహారం అనంతరం దేవతలు ఆనందోత్సాహాలతో దీపాలు వెలిగించారని చెబుతారు. దీంతో కార్తిక పౌర్ణమి శివుడి త్రిపురాంతక రూపాన్ని స్మరించుకునే త్రిపురారి పౌర్ణమి పర్వంగా నిలిచింది.
వాల్మీకి రామాయణంలోని బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు కార్తికేయ జన్మవృత్తాంతం చెబుతారు. శివ తేజస్సు, అగ్ని, గంగాదేవి, కృత్తికలతో ముడిపడిన ఈ జన్మ కథలోకుమారస్వామి ఆవిర్భావానికి సంబంధించిన విభిన్న ఘట్టాలు కనిపిస్తాయి. గంగలో చేరిన దివ్యతేజస్సు నుంచి ఆరుముఖాలతో బాలుడు ఆవిర్భవించడం, ఆరుగురు కృత్తికలు అతణ్ని పెంచడం వంటివి ఉన్నాయి. ఆరుగురు కృత్తికల చేత పెరిగినందు వల్ల స్కందుడు కార్తికేయుడు అయ్యాడు. ఇక్కడే కార్తికం, కృత్తిక, కార్తికేయుడు అనే మూడింటి మధ్య ఉన్న సాంస్కృతిక అనుబంధం కనిపిస్తుంది. కార్తిక మాసంలో కృత్తిక నక్షత్రానికి ఉన్న ప్రాధాన్యం స్కందోత్పత్తిని మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. శ్రీమద్భాగవతంలోని దశమస్కంధంలో వివరించిన దామోదర లీల కార్తిక మాస భక్తి సంప్రదాయంలో విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.
విష్ణుపురాణంలోని తృతీయాంశంలో కార్తిక పౌర్ణమి స్నానానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. శతధన్వుడు, అతని భార్య శైబ్యకు సంబంధించిన కథలో కార్తిక పౌర్ణమి రోజున భాగీరథి నదిలో స్నానం చేసి విష్ణువును ఆరాధించిన వృత్తాంతం కనిపిస్తుంది. స్కాందపురాణం, పద్మపురాణం వంటి గ్రంథాల్లోనూ కార్తిక మహాత్మ్యం, కార్తిక వ్రతం, దీపదానం, స్నానాల ప్రాశస్త్యం గురించి విస్తృతంగా ప్రస్తావించి ఉంది. కార్తిక మాసానికి శైవ సంప్రదాయంలో ఎంతటి ప్రాధాన్యం ఉందో వైష్ణవంలోనూ అంతే విశిష్ఠత ఉంది. కార్తిక మాసంలో భక్తులు దామోదరాష్టక పఠనం, దీపారాధన, తులసి సేవనం తప్పక పాటిస్తారు. తులసి మొక్కను పవిత్రంగా భావించి దాని సమీపంలో దీపం వెలిగించడం, ప్రదక్షిణలు చేయడం, శ్రీమహావిష్ణువును స్మరించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఉసిరి చెట్టు వద్ద పూజలు, వనభోజనాలు నిర్వహించడం ద్వారా ప్రకృతితో మానవుడికి ఉన్న ఆధ్యాత్మిక అనుబంధం ఆవిష్కృతమవుతుంది. కార్తిక పౌర్ణమి నాడు పవిత్ర నదుల్లో స్నానం చేయడం, దానం చేయడం, దీపం వెలిగించడం లాంటి ఆచారాలకు ఇలాంటి పురాణ సంప్రదాయాలు ఆధ్యాత్మిక నేపథ్యాన్ని అందించాయి. ఇదే రోజున అనేక ప్రాంతాల్లో దేవ దీపావళి నిర్వహిస్తారు. ముఖ్యంగా కాశీలో గంగానది ఘాట్లపై వెలిగించే లక్షలాది దీపాలు అపూర్వమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. దేవతలే గంగలో స్నానం చేయడానికి భూమికి దిగివచ్చే రోజుగా భావించే భక్తుల విశ్వాసం ఈ వేడుకకు దివ్యమైన నేపథ్యాన్ని ఇస్తుంది.

పురాణాలు, ఇతిహాసాలలోనూ ఈ పర్వదిన ప్రస్తావన ఉంటే చరిత్రపుటల్లోనూ కార్తిక పౌర్ణమికి సంబంధించిన ఆసక్తికరమైన ఆనవాళ్లు కనిపిస్తాయి. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి చెందిన ఉషవదాతుడి శాసనంలో కార్తిక మాస పౌర్ణమి తేదీ ప్రస్తావన ఉంది. ఈ శాసనం ప్రాచీన భారతదేశంలో తిథి, మాసాల ఆధారంగా తేదీలను నమోదు చేసే పద్ధతికి ముఖ్యమైన ఆధారంగా నిలుస్తుంది. అంటే కార్తిక పౌర్ణమి అనేది కేవలం ఆధునిక కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన పండుగ కాదు. ప్రాచీన భారతీయుల కాలగణనలోనూ, దానధర్మాల సంప్రదాయంలోనూ ఈ తిథికి గుర్తింపు ఉన్నట్లు శాసన ఆధారాలు సూచిస్తున్నాయి. ప్రాచీన శాసనాల్లో నెల, పక్షం, తిథి ఆధారంగా తేదీలను నమోదు చేయడం భారతీయ పంచాంగ వ్యవస్థకు ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని తెలుపుతుంది. అంతేకాకుండా ఈ మాసం నక్షత్ర ప్రాధాన్యాన్ని కూడా వివరిస్తుంది. కార్తిక మాసంలోనే ఒక నక్షత్రం ఉంది. అదే కృత్తిక. ప్రాచీన రుషులు కృత్తికను ఒక నక్షత్రంగా చూడలేదు. కాలగణనలోనూ, యజ్ఞయాగాదుల నిర్వహణలోనూ రుతువుల గుర్తింపులోనూ ఈ నక్షత్రానికి ప్రాధాన్యం ఇచ్చారు. వేదకాలపు నక్షత్ర జాబితాల్లో కృత్తికకు మొదటిస్థానం కనిపిస్తుంది. తైత్తిరీయ సంహిత, అథర్వ వేదాల్లోని నక్షత్ర క్రమం కృత్తికతో ప్రారంభమవుతుంది. ప్రతీ నక్షత్రానికి ఒక అధిదేవతను అనుసంధానిస్తూ ఆకాశాన్ని, కాలాన్ని గుర్తించే క్రమబద్ధమైన వ్యవస్థగా మన పూర్వికులు పరిశీలించారు. కృత్తికకు అగ్ని అధిదేవత. పౌర్ణమి రోజున చంద్రుడు కృత్తిక నక్షత్రానికి సమీపంగా ఉండే సంప్రదాయంతో కార్తిక మాసం వచ్చింది. ఒకవైపు కృత్తిక అగ్నిస్వరూపం, మరోవైపు కార్తిక దీపారాధనా ప్రాధాన్యం ఈ రెండిటి మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని సూచిస్తుంది.
కార్తిక పౌర్ణమి కేవలం పూజలు, పుణ్యస్నానాలు, దీపోత్సవాలకే పరిమితమైన పర్వదినం కాదు. చంద్రుడి కళలలను గమనిస్తూ కాలాన్ని లెక్కించిన మన పూర్వికుల విజ్ఞానానికి, ఈ పండుగకు సంబంధం ఉంది. ప్రకృతిలో మార్పులను గమనిస్తూ వాటిని జీవన విధానంలో భాగం చేసుకున్న భారతీయ సంస్కృతిలో కార్తిక పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. వేల సంవత్సరాల క్రితం క్యాలెండర్లు లేవు. ప్రకృతే మనిషికి తొలి గడియారం, ఆకాశమే తొలి పంచాంగం. సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రుడి కళలు, నక్షత్రాల కదలికలను గమనిస్తూ మనిషి కాలాన్ని అర్థం చేసుకున్నాడు. చంద్రుడిని గమనిస్తే ఒక అద్భుతమైన క్రమం కనిపిస్తుంది. అమావాస్య తర్వాత సన్నని చంద్రవంక కనిపిస్తుంది. రోజులు గడిచే కొద్దీ అది పెరుగుతూ అర్ధ చంద్రుడిగా, ఆపై పౌర్ణమి నాటికి నిండు చంద్రుడిగా మారుతుంది. మళ్లీ క్రమంగా క్షీణిస్తూ అమావాస్యకు చేరుకుంటుంది. ఈ చక్రం సుమారుగా 29.5 రోజుల వ్యవధిలో పూర్తవుతుంది. ఈ సహజ మార్పును ఆధారంగా చేసుకుని ప్రాచీనులు చంద్రమాస కాలగణనను అభివృద్ధి చేశారు. మన పంచాంగంలో అమావాస్య, పాడ్యమి, పౌర్ణమి తిథులకు ఉన్న ప్రాధాన్యం ఇక్కడి నుంచే అర్థమవుతుంది. తిథి అంటే కేవలం ఒక రోజు కాదు. సూర్యుడు, చంద్రుడికి మధ్య కోణీయ దూరం ప్రతీ 12 డిగ్రీలు పెరిగినప్పుడు ఒక తిథి పూర్తవుతుంది. ఇలా పదిహేను తిథులు ఒక పక్షంగా ఏర్పడతాయి. శుక్ల పక్షం, కృష్ణ పక్షం కలిపి ఒక మాసం అవుతుంది.
ఈ పునరావృత క్రమాన్ని గమనించిన పూర్వికులు నెలల గణనకు చంద్రుడిని ప్రామాణికంగా తీసుకున్నారు. యుగాలు మారినా, తరాలు మారినా కార్తిక పౌర్ణమి పవిత్రత చెక్కుచెదరలేదు. వేదమంత్రాల నుంచి పురాణగాథల వరకు, మహర్షుల తపస్సు నుంచి ఆరాధన వరకు ఈ పర్వదినం ఒక దివ్యమైన ఆధ్యాత్మిక పరంపరగా కొనసాగుతున్నది. కాశీ గంగాతీరంలో వేలాది దీపాలు వెలుగుతున్నా.. మరెక్కడో చిన్న పల్లెటూరి శివాలయంలో ఒక్క ప్రమిద వెలుగుతున్నా ఆ జ్యోతిలో కనిపించేది ఒకే పరమాత్మ తత్వం. ఆకాశంలో వెలుగును ఆరాధించడమే కాకుండా ఆ వెలుగు వెనక ఉన్న ప్రకృతి విజ్ఞానం కూడా ఈ పర్వదిన పరంపరలో కనిపిస్తుంది. చంద్రుడు మనకు కాలగమనాన్ని గుర్తు చేస్తాడు. పెరుగుదల, క్షీణత, పునరావృతం.. ప్రకృతిలో ఏదీ శాశ్వతంగా ఒకే స్థితిలో ఉండదనే రహస్యం తన కదలికల్లో చూపిస్తాడు. వెన్నెలలో శివుడి శాంత స్వరూపం, దీపజ్యోతిలో పరమాత్మ తేజస్సు, భక్తుడి హృదయంలో దైవసాన్నిధ్యం, చంద్రుని వెలుగుల్లో విజ్ఞానజ్యోతి ఈ నాలుగింటి సంగమమే కార్తిక పౌర్ణమి ప్రత్యేకం.
రంగనాథ్ మిద్దెల 9866573461…?
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

