న్యూఢిల్లీ: దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లోని విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. అయితే దీనికి గల కారణాలను అన్వేషించేందుకు సుప్రీంకోర్టు నియమిత ప్యానల్ విద్యార్థులపై సర్వే చేపట్టింది. సూసైడ్ ఆలోచనల(Suicidal Thoughts)తో సతమతం అవుతున్న విద్యార్థుల సంఖ్య 9 శాతంగా ఉన్నట్లు దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఆధారంగా వెల్లడైనట్లు సుప్రీం నియమిత ప్యానెల్ తెలిపింది. ఇక ఉన్నత విద్యా సంస్థల్లో సుమారు 15 శాతం మంది విద్యార్థులు గత ఆరు నెలల్లో కొన్ని సందర్భాల్లో అత్యంత సంతోషాన్ని, కొన్ని సందర్భాల్లో బాధను ఎదుర్కొన్నట్లు సర్వేలో తేల్చారు. సర్వేకు చెందిన వివరాలను ఓ మీడియా సంస్థ సేకరించింది. విద్యార్థుల్లో ఉన్న మానసిక ఆందోళనలను తగ్గించేందుకు, వారిలో ఆత్మహత్య ఆలోచనల్ని తగ్గించేందుకు సర్వే ద్వారా వివరాలను సేకరించారు. నేషనల్ టాస్క్ ఫోర్స్ దీనిపై నివేదికను తయారు చేసింది. అక్టోబర్ 31వ తేదీన ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
ఇటీవల ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే విద్యా సంస్థల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గతంలోనూ సుప్రీం నియమిత ప్యానెల్ ఓ తాత్కాలిక రిపోర్టును సమర్పించింది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారిలో సామాజిక అసమానతలు ఉన్నాయని, ఇక మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల్లో లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నట్లు ఆ రిపోర్టులో తెలిపారు. మెడికల్, లా, స్టేట్ యూనివర్సిటీల్లోని బోధనా సిబ్బందిలో లింగ వ్యత్యాసం ఉందన్నారు. నీట్ యూజీ, జేఈఈ ర్యాంకుల్లో కులం ఆధారంగా గుర్తింపు, కుల వివక్ష, కులం పేరుతో అవమానాలు, అడ్మిషన్ సమయంలో కుల ప్రస్తావన లాంటి అంశాల వల్ల విద్యార్థుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఆ రిపోర్టులో తెలిపారు.
ఎన్టీఎఫ్ రిపోర్టు ప్రకారం సుమారు 2.43 లక్షల మంది విద్యార్థులను సర్వేలో భాగంగా ప్రశ్నించారు. దీంట్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీకి చెందిన 67 శాతం మంది ఉన్నారు. అయితే వీరిలో 34 శాతం మంది క్యాంపస్‌లో బయటి వ్యక్తులు ఫీలవుతున్నట్లు చెప్పారు. సుమారు 15 శాతం మంది విద్యార్థులు గత ఆరు నెలలుగా బాధకు గురైనట్లు పేర్కొన్నారు. కొన్ని వారాల పాటు ఆందోళనతో ఉన్నట్లు విద్యార్థులు చెప్పారు. ఆత్మహత్య చేసుకోవాలన్న భావనలను గత ఏడాది నుంచి తరుచూ వస్తున్నట్లు సుమారు 9 శాతం మంది పేర్కొన్నారు. ఇక విద్యాసంస్థల్లో ఎదురయ్యే పరిస్థితిని చక్కదిద్దేందుకు 56 శాతం యాజమాన్యాలు సమర్ధంగా ఉన్నట్లు రిపోర్టులో తెలిపారు. 32 శాతం విద్యా సంస్థల్లో కౌన్సిలింగ్ సేవలు లేనట్లు తెలిసింది.
గత కొన్ని నెలలుగా ఎన్టీఎఫ్ సుమారు 19 విద్యా సంస్థలతో 30 మీటింగ్‌లు నిర్వహించింది. ఢిల్లీ, ఎన్సీఆర్, తమిళనాడు, కర్నాటక, అస్సాం, పశ్చిమ బెంగాల్లో ఎన్టీఎఫ్ విద్యాసంస్థలతో మాట్లాడింది. గత ఏడాది మార్చిలో ఎన్టీఎఫ్ను సుప్రీం నియమించింది. ఆ ప్యానల్‌కు జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ అధిపతిగా ఉన్నారు. ఆయనతో పాటు కొంత మంది నిపుణులు ఆ బృందంలో ఉన్నారు. ప్రఖ్యాత సైక్రియాట్రిస్ట్ అలోక్ సారిన్, మేరీ ఈ జాన్, అర్మాన్ అలీ, రాజేంద్ర కచ్రూ, సీమా మెహరోత్రా, నిమ్హన్స్ ఆ బృందంలో ఉన్నారు.