NIUM–IIIT |పట్టణాలు, పట్టణ స్థానిక సంస్థలు (ULBs) ఎదుర్కొంటున్న అభివృద్ధి చెందుతున్న సమస్యలకు పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలతో ఆచరణాత్మక పరిష్కారాలు అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ (NIUM), IIIT హైదరాబాద్ కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు రెండు సంస్థలు అవగాహన ఒప్పందం (MoU)పై సంతకాలు చేశాయి.
ప్రభుత్వం, విద్యా రంగం, సాంకేతిక సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం ఈ భాగస్వామ్యం ప్రధాన ఉద్దేశం. పట్టణ స్థానిక సంస్థలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలను గుర్తించి.. వాటికి అనుగుణంగా సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయనున్నారు. అనంతరం తెలంగాణలోని వివిధ మున్సిపాలిటీల్లో పైలట్ ప్రాజెక్టులుగా అమలు చేసి వాటి పనితీరును పరిశీలించనున్నారు.
పట్టణ పరిపాలనలో ఎదురయ్యే సమస్యలకు వినూత్న పరిష్కారాలను గుర్తించడం, అభివృద్ధి చేయడం, క్షేత్రస్థాయిలో పరీక్షించడం, విజయవంతమైన వాటిని విస్తృతంగా అమలు చేయడం కోసం NIUM ఇటీవల అర్బన్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ విభాగాలు, పట్టణ స్థానిక సంస్థలు, విద్యా-పరిశోధనా సంస్థలు, టెక్నాలజీ సంస్థలు, స్టార్టప్‌లు, ఆవిష్కర్తలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి పట్టణ సమస్యలకు పరిష్కారాలు రూపొందించడమే దీని లక్ష్యం.
IIIT హైదరాబాద్‌తో భాగస్వామ్యం ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు అవసరమైన పలు రంగాల్లో సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయనున్నారు. నీటి సరఫరా వ్యవస్థలో నీటి నాణ్యతను పర్యవేక్షించడం, పైప్‌లైన్ లీకేజీలను గుర్తించడం, నీటి వృథాను తగ్గించడం వంటి అంశాలపై టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను రూపొందించనున్నారు.
అలాగే విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు స్మార్ట్ వీధి దీపాల నిర్వహణ, ఇంటి వద్దే తడి-పొడి వ్యర్థాలను వేరు చేయడాన్ని పర్యవేక్షించడం, వ్యర్థాల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్ ప్రక్రియలను మరింత సమర్థవంతంగా నిర్వహించడం వంటి అంశాలపైనా దృష్టి సారించనున్నారు.
మున్సిపాలిటీల్లోని వివిధ సేవలు, కార్యకలాపాలు, పనితీరు వివరాలను ఒకే వేదికపై అందించే స్మార్ట్ డ్యాష్‌బోర్డులు, డేటా ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలు అభివృద్ధి చేయనున్నారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కారాన్ని ట్రాక్ చేసేందుకు డిజిటల్ సాధనాలను కూడా రూపొందించే అవకాశం ఉంది.
దీంతో ఉన్నతాధికారులు మున్సిపల్ సేవలను ఒకే వేదిక నుంచి పర్యవేక్షించడంతో పాటు.. సమస్యలను వేగంగా గుర్తించి పరిష్కరించే అవకాశం కలుగుతుంది.
అభివృద్ధి చేసే సాంకేతిక పరిష్కారాలను వాస్తవిక మున్సిపల్ పరిస్థితుల్లో పరీక్షించనున్నారు. తక్కువ వ్యయం, సులభమైన అమలు, సుస్థిరత, కొలిచే ఫలితాలు, ఇతర పట్టణ స్థానిక సంస్థల్లోనూ విస్తరించే అవకాశం ఉండేలా పరిష్కారాల రూపకల్పనకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పైలట్ ప్రాజెక్టులు విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర పట్టణ స్థానిక సంస్థల్లోనూ వాటిని అమలు చేసే అవకాశాలను పరిశీలించనున్నారు.
ఈ సందర్భంగా NIUM డైరెక్టర్ జనరల్ డా. టి.కె. శ్రీదేవి, IAS మాట్లాడుతూ.. నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, విద్యా రంగం, సాంకేతిక సంస్థలు, ఆవిష్కర్తలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణ సమస్యలకు ‘సమస్య నుంచి పరిష్కారం వరకు’ అనే విధానంలో పనిచేసే వేదికగా ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
ఆవిష్కరణలు కేవలం పరిశోధన లేదా ప్రదర్శనలకే పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల్లో అమలు చేసి, వాటి ఫలితాలను అంచనా వేయడం, విజయవంతమైన పరిష్కారాలను విస్తృత స్థాయిలో అమలు చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. IIIT హైదరాబాద్‌తో భాగస్వామ్యం ద్వారా మున్సిపల్ సేవలను బలోపేతం చేసే, ప్రజలకు మెరుగైన సేవలు అందించే ఆచరణాత్మక, కొలిచే విధమైన, తక్కువ వ్యయంతో కూడిన సాంకేతిక పరిష్కారాలు అభివృద్ధి చెందుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.