వికారాబాద్, అక్టోబర్ 2 : కనీసం గర్భిణులకు మందులిచ్చే సోయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మండిపడ్డారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు కనీస అవసరాలైన విద్య, వైద్యం అందించడంలో రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
దవాఖానల్లో గర్భిణులు, పెద్దలకు ఐరన్, కాల్షియం మాత్రలు ఎంతో ముఖ్యమని చెప్పారు. డాక్టర్‌గా చేసిన అనుభవం తనకు ఉన్నదని, ఈ మాత్రలు లేకపోవడం వల్ల పుట్టబోయే బిడ్డలకు అనారోగ్య సమస్యలు వస్తాయని వాపోయారు. తాండూరులో ఇటీవల తల్లీబిడ్డ చనిపోవడానికి రక్తహీనతే కారణమని గుర్తించారని తెలిపారు. ‘కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లను ఆక్రమించుకుంటామని రేవంత్‌రెడ్డి చెప్తున్నరు. రేవంత్‌రెడ్డి ఆక్రమించుకునేది ప్రజల మనసును కాదు..
అక్కడున్న భూములను మాత్రమే’ అని ఎద్దేవాచేశారు. వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తంచేశారు. వికారాబాద్ ఎమ్మెల్యే, స్పీకర్ విదేశాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, కౌన్సిలర్ వేణుగోపాల్, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, అంజయ్య, నర్సింహులు, మల్లేశం, రాజు, అనిల్, అశోక్ పాల్గొన్నారు.