హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు దసరా కానుకగా రెండు డీఏలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం శోచనీయమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం ఇవ్వడం కానుక కాదని, అది ఉద్యోగుల హక్కు అని స్పష్టంచేశారు. ఉద్యోగ సంఘాల అల్టిమేటంతోనే సర్కార్ దిగొచ్చిందని, వారికి మేలు చేయాలనే తపపనతో కాదని వ్యాఖ్యానించారు.
శుక్రవారం ఆయన తెలంగాణభవన్‌లో పార్టీ నేతలు సుమిత్రానంద్, క్యాదసు కల్యాణ్‌కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. సర్కార్‌కు చిత్తశుద్ధి ఉంటే దసరా కానుకగా డీఏల విడుదల కాదు.. పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఉద్యోగులకు అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ మూడేండ్లయినా నెరవేర్చకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
ఉద్యోగులకు హక్కుగా ఇవ్వాల్సిన పీఆర్సీపై సర్కార్ డ్రామాలు ఆడుతున్నదని శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. సాకులు చెబుతూ పదేపదే గడువు పొడిగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులనే తిరిగి వారికి ఇవ్వడం ప్రభుత్వానికి భారం ఎలా అవుతుందని నిలదీశారు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ అమల్లోనూ సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు.
వెల్నెస్ సెంటర్లకు వెళ్తే పట్టించుకొనే నాథుడేలేడని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల ఆరోగ్య భద్రతా స్కీమ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కనుమరుగు చేసిందని దుయ్యబట్టారు. క్రమశిక్షణ పేరిట పోలీసులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటే ఊరుకొనే ప్రసక్తిలేదని హెచ్చరించారు. జర్నలిస్టు హెల్త్‌కార్డుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ జర్నలిస్టులకు అడుగడుగునా అన్యాయం చేస్తున్నదని దుయ్యబట్టారు.
అధికారంలోకి రాగానే ఒప్పంద ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వేతనాలిస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ ఆచరణలో ఘోరంగా విఫలమైందని శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలను ఏజెన్సీలు రూ.1,100 కోట్లు కాజేసినట్టు కమిటీ నిర్ధారించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అక్రమ సొమ్మును ఎందుకు రికవరీ చేయలేదని, బాధ్యులపై కేసు ఎందుకు పెట్టలేదని పశ్నించారు. దీని వెనుక ఉన్న మంత్రి ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు.