హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ మానవీయ పాలనకు కల్యాణలక్ష్మి పథకం నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పథకం ప్రారంభమై 12 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమ సమయంలో ఒక గిరిజన తండాలో స్వయంగా చూసిన సంఘటన ప్రేరణగా ఈ పథకానికి కేసీఆర్ శ్రీకారం చూట్టారని గుర్తుచేశారు. లక్షల కుటుంబాలకు ఆడబిడ్డ పెండ్లి సమయం లో కేసీఆర్ మేనమామగా నిలిచారని, పేద కుటుంబాలకు పెద్ద దిక్కు అయ్యారని కొనియాడారు.
పేదింటి ఆడబిడ్డ పెండ్లికి రూ.1,00,116 కానుకగా అందించాలన్న ఆలోచన కేసీఆర్కు తప్ప ప్రపంచంలో ఏ నాయకుడికీ రాలేదని స్పష్టంచేశారు. ఆడబిడ్డ పెండ్లి సమయంలో తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ పథకం ఉపయోగపడిందని, బాల్యవివాహాలను తగ్గించినట్టు చెప్పారు. పన్నెండేండ్లలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 16.78 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరినట్టు వెల్లడించారు. కాంగ్రెస్ ఈ పథకాన్ని రద్దు చేసే కుట్రలు చేస్తున్నదని, కల్యాణలక్ష్మితోపాటు ఇస్తానన్న తులం బంగారం దేవుడెరుగు, ఈ పథకమే లేకుండా చేసేందుకు రేవంత్రెడ్డి పావులు కదుపుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు.