న్యూఢిల్లీ: కొన్ని వ్యవసాయ పంటలకు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరపై రైతు సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. గోధుమలకు కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ. 25 పెంచడాన్ని తీవ్రంగా నిరసించాయి. పంటల ప్రస్తుత ఉత్పత్తి వ్యయానికి, ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు ఏమాత్రం పొంతనలేదని పేర్కొన్నాయి. రైతులకు లాభదాయకమైన రాబడులను చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం కనీస మద్దతు ధరను నిర్ణయిస్తున్నట్టు ప్రకటించడాన్ని వారు ప్రస్తావిస్తూ ఈ పెంపు పెరిగిన సాగువ్యయాల పెరుగుదలను తగినంతగా ప్రతిబింబిస్తున్నదా? అని ప్రశ్నించాయి.
ప్రతి పంటకూ కనీస మద్దతు ధర నిర్ణయించేటప్పుడు అసాధారణంగా పెరుగుతున్న సాగు ఖర్చు, ద్రవ్యోల్బణానికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ఒక పక్క కలుపు సంహారక, క్రిమిసంహారక ముందుల ధరలు ఒకటిన్నర రెట్లు పెరిగాయని, మరో పక్క డీజిల్ ధరలు కూడా భారమయ్యాయని, ఇవేమీ పరిగణనలోకి తీసుకోకుండా గోధుమల కనీస మద్దతు ధరను రూ.25 పెంచుతూ క్వింటాల్‌కు రూ.2,610 గా నిర్ణయించడాన్ని భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ ప్రతినిధి ధర్మేంద్ర మాలిక్ తీవ్రంగా విమర్శించారు.
మద్దతు ధరను 0.96 శాతం పెంచడం రైతులను మోసగించడమేనని అన్నారు. నిత్యం పెరుగుతున్న సాగు పెట్టుబడులు, ఆహార ధరలు, గృహ జీవన వ్యయాలను పరిగణనలోకి తీసుకుని కనీస మద్దతు ధరను నిర్ణయించాలని సంయుక్త కిసాన్ మోర్చా సమన్వయ కమిటీ సభ్యుడు పి కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు.