బెళగావి(కర్ణాటక), అక్టోబర్ 2: ఒక దేశం, ఒక ఎన్నికల ప్రతిపాదనకు సంబంధించిన రాజ్యాంగ(129వ సవరణ) బిల్లు, 2024ను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ), సుప్రీంకోర్టుకు చెందిన ఇతర న్యాయమూర్తులు అక్టోబర్ 6న జరపాలని ప్రతిపాదించిన సమావేశాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ అంశంపై చర్చించడం సముచితం లేదా వాంఛనీయం కాదు అని న్యాయస్థానం ఈ సందర్భంగా నొక్కిచెప్పింది.
భారత సర్వోన్నత న్యాయస్థానం ముందు ప్రతిపాదిత సవరణ న్యాయపరమైన సమీక్షకు దారితీయవచ్చు కాబట్టి, ఈ అంశాన్ని పరిపాలనాపరమైన స్థాయిలో చర్చించడం సమంజసం కాకపోవచ్చని న్యాయమూర్తులు భావిస్తున్నారు. ఈ కారణంగా ప్రతిపాదించిన సమావేశం రద్దు చేయడం జరిగింది అని ఆ కమిటీకి పంపిన అధికారిక సమాచారంలో సుప్రీంకోర్టు పేర్కొంది. సీజేఐ, ఇతర న్యాయమూర్తులతో స్థానిక అధ్యయన పర్యటనగా పేర్కొంటూ ఒక అనధికారిక సంభాషణను సెప్టెంబర్ 28న పంపిన ఒక ఈమెయిల్లో ఎన్నికల సంఘం కోరినట్టు తెలిసింది.
ఈ అభ్యర్థనను న్యాయ, న్యాయ మంత్రిత్వశాఖలోని శాసన వ్యవహారాల విభాగం ద్వారా పంపినట్టు సమాచారం. సెక్రటరీ జనరల్ కార్యాలయం ద్వారా సుప్రీంకోర్టు స్పందిస్తూ సీనియర్ న్యాయమూర్తులు ఈ ప్రతిపాదనపై చర్చించారని శాసన విభాగానికి తెలియచేసింది. పార్లమెంటరీ కమిటీకి బీజేపీ ఎంపీ, మాజీ న్యాయశాఖ మంత్రి పీపీ చౌదరి అధ్యక్షత వహిస్తున్నారు.
అయితే, ఇతర సభ్యులతోపాటు రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కూడా ప్రతిపాదిత సమావేశంపై అభ్యంతరాలు లేవనెత్తారు. అక్టోబర్ 6న ఈ కమిటీ ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులతో జరప తలపెట్టిన సమావేశాన్ని పరిహాసంగా ఆయన అభివర్ణించారు. రాజ్యాంగ(129వ సమరణ) బిల్లు, 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల(సవరణ) బిల్లు, 2024 లోక్సభ, రాష్ట్ర శాసనభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలు కల్పించే లక్ష్యాన్ని కలిగి ఉన్నాయి.
వీటిని 2024 డిసెంబర్లో జేపీసీకి నివేదించడం జరిగింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా 39 మంది సభ్యులతో కూడిన ఈ సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూలైలో లోక్సభ ఈ కమిటీ పదవీకాలాన్ని శీతాకాల సమావేశాల దాకా పొడిగించింది. గత సంవత్సర కాలంలో నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జేఎస్ భేహర్, రంజన్ గొగోయ్, డీవై చంద్రచూడ్, యూయూ లలిత్ ఈ కమిటీ ముందు హాజరయ్యారు. రాజ్యాంగ సవరణ తర్వాత జమిలి ప్రణాళిక రాజ్యాంగబద్ధత పొందుతుందని ఆ నలుగురూ సూచించినప్పటికీ ఎన్నికల సంఘానికి లభించే విస్తృత అధికారాల గురంచి వారు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది.