హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అనలెటిక్స్ కోర్సు.. ఇంజినీరింగ్‌లో ప్రాచుర్యం పొందిన కోర్సు. ఇదే కోవలో కొత్తగా బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ అనలెటిక్స్ కోర్సు కూడా రాబోతున్నది. వ్యాపార డాటాను సేకరించడం, ప్రాసెస్ చేయడం, విశ్లేషించడం ఈ కోర్సు ప్రత్యేకత. తెలుగులో ఈ కోర్సును వ్యాపార మేధస్సు విశ్లేషణగా పిలుస్తాం. జాతీయంగా బిజినెస్ డాటా సైంటిస్ట్లకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో 2026-27 విద్యాసంవత్సరం నుంచి ఈ కొత్త కోర్సును మన దగ్గర ప్రవేశపెట్టాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
ఈ కోర్సులో ఎనీ ఇంటర్ విద్యార్థులు చేరవచ్చు. అంటే ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ వంటి కోర్సులు పూర్తిచేసిన వారు ప్రవేశాలు పొందవచ్చు. వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొత్తగా బీబీఏ రూరల్ మేనేజ్మెంట్ కోర్సును సైతం ఉన్నత మండలి ప్రవేశపెట్టనున్నది. ఈ కోర్సు పూర్తిచేసిన తర్వాత ఎఫ్‌పీవో కో ఆర్డినేటర్లు, వ్యవసాయ వ్యాపార కంపెనీల్లో ఉద్యోగాలు పొందవచ్చు. వచ్చే విద్యాసంవత్సరం 10 కొత్త డిగ్రీ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 8 కోర్సుల్లో ఎనీ ఇంటర్ విద్యార్థులు చేరవచ్చు. ఒక్క బీఎస్సీ మల్టీమీడియా డిజైన్ అండ్ యానిమేషన్, బీఎస్సీ ఫుడ్ సెక్యూరిటీ ఫుడ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కోర్సుల్లో మాత్రమే సైన్స్ విద్యార్థులకు ఎంట్రీ ఉంటుంది.
కొత్త కోర్సులివే..
జాబ్ గ్యారెంటీ కోర్సులివి

మన దగ్గర ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. దీంతో జాబ్ గ్యారెంటీ కోర్సులకు రూపకల్పన చేశాం. ఎయిర్పోర్ట్, ఎయిర్‌లైన్స్, ఎయిర్‌స్పేస్ మేనేజ్మెంట్, ఫెన్స్ సెక్యూరిటీ వంటి రంగాల్లో ఉద్యోగాలున్నాయి. కానీ నైపుణ్యం గల యువత లేరు. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ రంగంలోనూ భారీ అవకాశాలున్నాయి. అవగాహన, శిక్షణ పొందిన వారు దొరకడంలేదు. దీంతో పది కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తాం. ఏఐ ట్యూటర్లను వినియోగించి పాఠాలు బోధిస్తాం.
– ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్