Kayalvizhi : తమిళనాడు (Tamil Nadu) మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి (Karunanidhi) మనవరాలు, కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి (MK Alagiri) కుమార్తె కాయల్విళి (Kayalvizhi) ఓ బ్యాంకు మేనేజర్ (Bank Manager) పై చేయి చేసుకున్నారు. లిఫ్ట్ పనిచేయడం లేదన్న విషయంలో చెలరేగిన వివాదంలో ఆమె భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) బ్రాంచ్ మేనేజర్‌ను చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
జూలై 20న చెన్నైలోని అడయార్ ఏరియాలో ఉన్న ఎస్బీఐ ఎన్ఆర్ఐ బ్రాంచ్‌లో ఈ ఘటన జరిగింది. బ్యాంకు ఉన్న భవనంలోని లిఫ్ట్ పనిచేయకపోవడంపై కాయల్విళి, బ్రాంచ్ మేనేజర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ భవనం కాయల్విళికి చెందినదిగా తెలుస్తోంది. మాటామాటా పెరగడంతో ఆమె తొలుత మేనేజర్ హావభావాలను హేళనచేస్తూ అనుకరించారు. ఆ తర్వాత ఆయన చెంపపై కొట్టారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మరో వ్యక్తి ఆమెను ఆపేందుకు ప్రయత్నించడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.
ఈ ఘటనపై ఎస్బీఐ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బ్రాంచ్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఈ ఫుటేజ్ శనివారం సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. మేనేజర్‌పై దాడిచేసి, బెదిరించిన ఆరోపణలతో కాయల్విళిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు.