TRP War | తెలుగు టెలివిజన్ రంగంలో ఆదివారం నాన్-ఫిక్షన్ ఎంటర్టైన్మెంట్ షోల మధ్య టీఆర్పీ పోరు మరింత ఆసక్తికరంగా మారుతోంది. గత కొంతకాలంగా జీ తెలుగు, స్టార్ మా ఛానళ్లు రియాలిటీ షోలు, స్పెషల్ ఈవెంట్లతో ఆదివారం ప్రైమ్‌టైమ్‌ను ఆక్రమిస్తుండగా.. ఇప్పుడు వారికి గట్టి పోటీ ఇచ్చేందుకు ఈటీవీ భారీ మార్పులతో ముందుకొచ్చింది. షోల టైమింగ్స్, యాంకర్లు, కాన్సెప్ట్‌లలో కీలక మార్పులు చేస్తూ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది.ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు యాంకర్‌గా కొనసాగిన రష్మి గౌతమ్ స్థానంలో ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు బాధ్యతలు చేపట్టారు. తనదైన హాస్యం, చురుకైన వ్యాఖ్యానంతో ప్రేక్షకులను అలరించే ప్రదీప్ రాకతో ఈ షో టీఆర్పీ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటివరకు శుక్ర, శనివారాల్లో ప్రసారమవుతున్న ‘జబర్దస్త్’ షోను ఈటీవీ ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రైమ్టైమ్కు మార్చింది. దీనికి తోడు ప్రేక్షకుల అభిమాన కమెడియన్ హైపర్ ఆది మళ్లీ షోలోకి రీఎంట్రీ ఇవ్వడం మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆయన పంచ్‌లు, స్కిట్లు, కామెడీ టైమింగ్ షోకు కొత్త ఊపు తీసుకురానున్నాయని నిర్వాహకులు భావిస్తున్నారు. ఆదివారం రాత్రి 7:30 గంటలకు ‘ఫ్యామిలీ స్టార్స్ సీజన్-2’ ప్రారంభం కానుంది. ఈ షోకు సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బుల్లితెరపై సుధీర్‌కు ఉన్న భారీ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ షోను ప్రైమ్‌టైమ్‌లో తీసుకువస్తున్నారు. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే టాస్కులు, సెలబ్రిటీ ఎంటర్టైన్మెంట్తో ఈ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ప్రేక్షకులను తమ ఛానల్‌కే కట్టిపడేయాలనే లక్ష్యంతో ఈటీవీ ఈ కొత్త లైన్అప్ను సిద్ధం చేసింది. ప్రదీప్ మాచిరాజు, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ వంటి బుల్లితెర స్టార్లను ఒకే రోజు వరుసగా తీసుకురావడం ద్వారా పోటీ ఛానళ్లకు గట్టి సవాల్ విసరాలని భావిస్తోంది. ఈ కొత్త వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో, ఆదివారం టీఆర్పీ రేసులో ఈటీవీకి ఎంతటి ఆధిక్యం తీసుకొస్తుందో రాబోయే వారాల్లో స్పష్టత రానుంది. ప్రస్తుతం మాత్రం ఈటీవీ సండే లైన్అప్ బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.