సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగు రోడ్డుపై గణనీయంగా ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. గ్రేటర్ చుట్టూ 158 కి.మీ మేర ఉన్న ఓఆర్ఆర్ మీదుగా కోర్ సిటీ లోపలి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతో పాటు ప్రత్యేకంగా రేడియల్, లింకు రోడ్లు ఉండటంతో నగరవాసులు ఔటర్‌ను తమ రాకపోకలకు ఎక్కువగా వినియోగిస్తున్నారు. కొన్ని కిలోమీటర్ల దూరం పెరిగినా.. ఎంతో వేగంగా, భద్రతతో గమ్యస్థానానికి చేరుకునేందుకు అత్యంత అనుకూలంగా ఉండటంతో ఔటర్‌పై ఏటా ట్రాఫిక్ రద్దీ 15-20 శాతం వరకు పెరుగుతోంది.
తాజాగా ప్రతి రోజు 1.80 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఓఆర్ఆర్పై ఎక్కువగా ఐటీ కారిడార్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ పెరగడంతో కొత్తగా రెండు ఇంటర్‌చేంజ్‌లలో ఒక దానిని నార్సింగి వద్ద నిర్మించి ఇప్పటికే ప్రారంభించగా, కోకాపేట నియో పోలిస్ లే అవుట్‌ను అనుసంధానం చేస్తూ..మరో ఇంటర్చేంజ్ నిర్మాణంలో ఉన్నది. అదేవిధంగా పటాన్చెరు-దుండిగల్ మార్గంలో మల్లంపేట-బాచుపల్లి వద్ద మరో ఇంటర్‌చేంజ్‌ను నిర్మించి.. అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఏటా ట్రాఫిక్ పెరుగుతుండటంతో ఇంటర్‌చేంజ్‌ల వద్ద ఉన్న ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల వద్ద వాహనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నాయి. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డు దాటిన తర్వాత ఉన్న ప్రాంతాల్లోనూ పట్టణీకరణ శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఔటర్‌పై ఉన్న ఇప్పటికే ఇంటర్‌చేంజ్‌ల వారీగా వాహనాల రాకపోకలు గుర్తించి.. కొత్త ఇంటర్‌చేంజ్‌ల నిర్మాణంపై దృష్టి సారించారు. అదే సమయంలో ఇంటర్‌చేంజ్‌ల వద్ద ఉన్న ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపులను పెంచాల్సిన అవసరమున్నదని గుర్తించారు.
ఔటర్ రింగు రోడ్డుపై మొత్తం 21 చోట్ల ఇంటర్‌చేంజ్‌లు ఉన్నాయి. అక్కడి నుంచి వాహనాలు ఓఆర్ఆర్పైకి ఎక్కేందుకు, కిందకు దిగేందుకు ఎంట్రీ, ఎగ్జిట్ పేరుతో ర్యాంపులను కేవలం రెండు వరసల్లో నిర్మించారు. ప్రస్తుతం వాహనాల రద్దీ గణనీయంగా పెరగడంతో ఎంట్రీ చేసే సమయంలో రశీదు ఇచ్చేందుకు వాహనాలు ఆగాల్సి వస్తోంది. అదేవిధంగా దిగే సమయంలో ఫాస్టాగ్ చెల్లింపులు చేసేందుకు, ఫాస్టాగ్ లేని వారు నేరుగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
ఓఆర్ఆర్పైకి ఎక్కిన సమయంలో ఇచ్చే రశీదును ఇచ్చి.. టోల్ చార్జీలను చెల్లించేందుకు వాహనాలను నిలుపాల్సి వస్తోంది. దీంతో ఈ సమయంలో వాహనాలు ఎక్కువగా ఇంటర్‌చేంజ్‌ల వద్ద ఉన్న డౌన్ ర్యాంపు(ఎగ్జిట్)లపై రెండు వరసల్లో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోతున్నాయి. ఓఆర్ఆర్పై గంటకు 120 కి.మీ నుంచి 80 కి.మీ వేగంతో ప్రయాణించే వాహనాలు.. కిందకు దిగే సమయంలో కొన్ని ర్యాంపుల వద్ద 2 నుంచి 5 నిమిషాల పాటు ఆలస్యమవుతోందని వాహనదారులు పేర్కొంటున్నారు.
ఆలస్యం కారణంగా కొన్ని ఇంటర్చేంజ్ డౌన్ ర్యాంపుల వద్ద వాహనదారులు ఓఆర్ఆర్ టోల్‌ప్లాజా నిర్వాహకులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన హెచ్ఎండీఏ అధికారులు.. రద్దీ ఎక్కువగా ఉన్న ఇంటర్‌చేంజ్‌ల వద్ద ట్రాఫిక్ అధ్యయనం చేపట్టారు. ఇంటర్‌చేంజ్‌ల వద్ద వాహనాలు వేగంగా ఎగ్జిట్ అయ్యేందుకు అదనంగా ర్యాంపులను నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.