టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిచెందడంతో తదుపరి సుప్రీం లీడర్ ఎవరన్న దానిపై విస్తృత చర్చ నడుస్తున్నది. తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీ రెజా అరాఫీ నియమితులయ్యారు. అసలు సుప్రీం లీడర్‌ను ఎలా ఎన్నుకుంటారు? రేసులో ఎవరెవరు ఉన్నారు? అనేది పరిశీలిద్దాం..
ఎలా ఎన్నుకుంటారు?
88 మంది సభ్యులు గల ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్’.. ఇరాన్ సుప్రీం లీడర్‌ను ఎంపిక చేస్తుంది. సుప్రీం లీడర్‌ను తొలగించే అధికారం కూడా ఈ అసెంబ్లీకి ఉన్నది. అయితే ఇప్పటివరకు అది జరుగలేదు. ఈ ప్యానెల్లో షియా మతగురువులు ఉంటారు. ప్రతి ఎనిదేండ్లకొకసారి వీరిని ప్రజలు ఎన్నుకుంటారు. అయితే వీరి అభ్యర్థిత్వాన్ని ముందుగా శక్తివంతమైన కాన్స్టిట్యూషనల్ వాచ్డాగ్ ‘గార్డియన్ కౌన్సిల్’ ఆమోదించాల్సి ఉంటుంది. వివిధ ఎన్నికల్లో అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడంలో ఈ కౌన్సిల్ పెట్టింది పేరు. 2024 మార్చిలో నిపుణుల అసెంబ్లీకి పోటీచేయకుండా మాజీ అధ్యక్షుడు హసన్ రౌహనీపై ఈ కౌన్సిల్ నిషేధం విధించింది.
నాయకత్వ శూన్యత ఉన్నప్పుడు?
ప్రస్తుత సుప్రీం లీడర్ ఖమేనీ హత్య వల్ల కొత్త సుప్రీం లీడర్‌ను వీలైనంత త్వరగా ఎన్నుకోవాలని ఇరాన్ చట్టం నిర్దేశిస్తున్నది. అయితే అప్పటివరకు నాయకత్వ బాధ్యతలను కౌన్సిల్ చేపడుతుంది. దీనిలో ఇరాన్ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, గార్డియన్ కౌన్సిల్ సభ్యుడు ఒకరు సభ్యులుగా ఉంటారు. కొత్త సుప్రీం లీడర్ ఎన్నికయ్యేవరకు వీరు పాలనా పగ్గాలు చేపడుతారు.
సుప్రీం లీడర్ అంటే?
ఇరాన్లో రాజకీయంగా, మతపరంగా అత్యున్నత పదవి ఇది. సాయుధ దళాలకు ఆయనే అధిపతి. దేశంలో అన్ని విషయాల్లో ఆయనదే తుది నిర్ణయం. జ్యుడిషియరీ, మిలిటరీ, మీడియా నియామకాలు ఆయనే చేపడతారు. ఆర్మీకి సమాంతరంగా నడిచే పారామిలిటరీ ఫోర్స్ రివల్యూషనరీ గార్డ్స్కూ ఆయనే సుప్రీం కమాండర్.
రేసులో ఎవరెవరు ఉన్నారు?
మొజ్తాబా ఖమేనీ: ఖమేనీ రెండో కుమారుడు ఈయన. చట్టసభ సభ్యులతోపాటు రివల్యూషనరీ గార్డ్స్లోనూ ఆయనకు మంచి పలుకుబడి ఉన్నది. ఖమేనీ వారసత్వం ఆయనకు ప్రతిబంధకంగా మారింది. తండ్రి నుంచి కుమారుడికి అధికార మార్పిడిని ఆయన గతంలో వ్యతిరేకించారు. అలీరెజా అరాఫీ: ఇరాన్లో మతపరంగా అత్యంత ప్రభావశీలురు. రాజకీయంగా మాత్రం అంతగా ఆమోదయోగ్యత లేదు. ఈయన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌కు డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు. గార్డియన్ కౌన్సిల్లో కూడా సభ్యుడు.
మొహమ్మద్ మెహదీ మిర్బాఘెరీ
ఈయన మత ఛాందసవాది. నిపుణుల అసెంబ్లీలో సభ్యుడు. ఇస్లామిక్ సైన్సెస్ అకాడమీ అధిపతిగా ఉన్నారు.
ఘోలమ్ హుస్సేన్ మొహ్సెనీ-ఎజీ
ఈయన సీనియర్ మతగురువు. ప్రస్తుతం ఇరాన్ న్యాయవ్యవస్థ అధిపతిగా ఉన్నారు. అంతకుముందు 2005 నుంచి 2009 వరకు ఇంటెలిజెన్స్ మంత్రిగా వ్యవహరించారు.
హసన్ ఖమేనీ
ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు అయతొల్లా రొహల్లా ఖమేనీ మనవడు ఈయన. ప్రభుత్వంలో ఈయన ఎలాంటి బాధ్యతలు చేపట్టకపోయినప్పటికీ, ఈయన అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. 2016లో నిపుణుల అసెంబ్లీకి పోటీచేసినప్పటికీ, గార్డియన్ కౌన్సిల్ అనర్హత వేటు వేసింది.