Sunitha Lakshma Reddy | శివంపేట, ఆగస్టు 5 : శివ్వంపేట మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో విద్యుత్ సమస్యలు హాట్‌టాపిక్‌గా నిలిచాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులతో నిర్వహించిన తొలి సమావేశం కావడంతో ముందుగా వారు పరస్పరం పరిచయం చేసుకున్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులు తమ శాఖల పనితీరును వివరించారు. విద్యుత్ శాఖ ఏఈ పనితీరును వివరిస్తున్న సమయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సమక్షంలోనే పలువురు సర్పంచులు ఒక్కసారిగా లేచి విద్యుత్ అధికారులను నిలదీశారు.
గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటులో నిర్లక్ష్యం, కిందకు వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయకపోవడం, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఎల్సీలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం, ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో కొంతసేపు విద్యుత్ సమస్యలపై వాడివేడి చర్చ సాగింది. అనంతరం సర్పంచులు తమ గ్రామాల్లో ఉన్న తాగునీరు, మురుగు కాలువలు, సీసీ రోడ్లు, బస్సు సౌకర్యం తదితర సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేశామని, ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్‌ను 10 గంటలకు పరిమితం చేయడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రోజుకు కనీసం 14 నుంచి 16 గంటల వ్యవసాయ విద్యుత్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, వచ్చే సమావేశం నాటికి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని లేని పక్షంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
నిర్లక్ష్యం ప్రదర్శిస్తే బాధ్యులపై చర్యలు..
నిర్లక్ష్యం ప్రదర్శిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సింగూరు నుంచి నీటి సరఫరా లేకపోయినా గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన పంపుల ద్వారా గోదావరి జలాలు శివంపేట మండలానికి అందుతున్నాయని, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. సికిండ్లాపూర్, పోతులబోగుడ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని, శివ్వంపేట జూనియర్ కళాశాలకు ప్రత్యేక భవనం మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి లేఖ పంపినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా మండలంలోని ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
సర్పంచులు ప్రజలకు అందుబాటులో ఉంటూ మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆదర్శ ప్రజాప్రతినిధులుగా నిలవాలని సూచించారు. అంతకుముందు ఆయిల్ పామ్ సాగు అవకాశాలపై ఆయిల్ పామ్ కంపెనీ డైరెక్టర్ రంగనాయక్ వివరించారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, డివిజనల్ పంచాయతీ అధికారి సురేష్‌బాబు, తహసీల్దార్ కమలాద్రి, ఎంపీడీవో వెంకటలక్ష్మమ్మ, వివిధ శాఖల అధికారులు, మండలంలోని సర్పంచులు పాల్గొన్నారు.

