– మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం, సెప్టెంబర్ 30 : సిరిసిల్ల సభలో కేసీఆర్, కేటీఆర్ లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖండించారు. అబద్ధాలు, విద్వేషాలు, దూషణలతో కాలక్షేపం చేస్తూ రాష్ట్రంలో పరిపాలనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాలికి వదిలేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆవేశానికి లోనై ఆక్రోశంతో సిరిసిల్ల సభలో కేసీఆర్, కేటీఆర్‌పై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గౌరవం, సంస్కారం పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందని, కానీ అందుకు భిన్నంగా వ్యక్తిగత విమర్శలు, అసభ్య పదజాలంతో రేవంత్ రెడ్డి మాట్లాడటం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాల్సిన సమయంలో బీఆర్ఎస్ ముఖ్యనేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ, పరిపాలనలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం సిరిసిల్ల సభలో రేవంత్ రెడ్డి చేశారని అజయ్ కుమార్ అన్నారు.