లక్నో: రిలయన్స్ ఇండస్ట్రీస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్, రాజ్యసభ సభ్యుడు పరిమల్ నథ్వానీ కుమారుడైన ధనరాజ్ నథ్వానీ, ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆయనను తమ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ప్రకటించింది. (Dhanraj Nathwani) ధనరాజ్ నథ్వానీ తండ్రి పరిమల్ నథ్వానీ రాజ్యసభకు తిరిగి రావడానికి ఎన్డీఏ మద్దతు ఇచ్చిన కొన్ని నెలల తర్వాత ఈ సంఘటన జరిగింది. ఉత్తర ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు, 10 రాజ్యసభ స్థానాల భర్తీ కోసం అక్టోబర్ 16న పోలింగ్ జరుగనున్నది. ఎస్పీ సీనియర్ నేత రామ్ గోపాల్ యాదవ్‌తో పాటు ధనరాజ్ నథ్వానీ తమ అభ్యర్థులుగా ఆ పార్టీ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలోని ప్రస్తుత బలం ఆధారంగా, బీజేపీ నేతృత్వంలోని కూటమి ఎనిమిది సీట్లు, సమాజ్‌వాదీ పార్టీ రెండు సీట్లు గెలుచుకునే అవకాశమున్నది.
కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన ధనరాజ్ నథ్వానీ, బుధవారం ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో లక్నోలో తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఆ తర్వాత ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా తనను నామినేట్ చేసినందుకు అఖిలేష్ యాదవ్‌కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. ‘ఈ రోజు లక్నోలో గౌరవనీయ అఖిలేష్ యాదవ్ సమక్షంలో, నా ప్రజా జీవితంలో ఒక కొత్త దశకు నాంది పలుకుతూ రాజ్యసభకు నా నామినేషన్‌ను దాఖలు చేశాను’ అని పేర్కొన్నారు.
మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ అయిన ధనరాజ్ నథ్వానీ, జామ్‌నగర్ తయారీ విభాగాల పర్యవేక్షణ, గుజరాత్‌లోని జియో వ్యాపారంపై వ్యూహాత్మక పర్యవేక్షణ, ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ విభాగానికి నేతృత్వం, రిలయన్స్ జియో డిఫెన్స్ సిస్టమ్ లిమిటెడ్‌ను పర్యవేక్షించడం వంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ద్వారకాధీశ్ ఆలయ పరిపాలనా కమిటీకి ఉపాధ్యక్షుడిగా, నాథద్వార ఆలయ బోర్డు, గుజరాత్ రాష్ట్ర వన్యప్రాణుల బోర్డులో సభ్యుడిగానూ వ్యవహరిస్తున్నారు. తాజాగా రాజ్యసభకు పోటీతో కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ఆయన కొనసాగించనున్నారు.
అయితే ధనరాజ్ నథ్వానీని రాజ్యసభ అభ్యర్థిగా బరిలోకి దించడంపై ఎస్పీ సీనియర్ నేత ఒకరు స్పందించారు. ‘మేము మిమ్మల్ని ఆశ్చర్యపరిచాము కదా? ఇలాంటి మరిన్ని ఆశ్చర్యకరమైన పరిణామాల కోసం వేచి చూడండి’ అని మీడియాతో అన్నారు.