Vijay | తమిళ స్టార్ హీరో, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయకన్ విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి.రాజకీయాల్లో విజయవంతమైన విజయ్‌కు ఇది సినీ కెరీర్లో వీడ్కోలు చిత్రం కావడంతో అభిమానులు ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా పూర్తిగా విఫలమైందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు మిగిల్చినట్లు సమాచారం.
‘జన నాయకన్’ చిత్రం తెలుగులో బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ భగవంత్ కేసరి అధికారిక రీమేక్‌గా రూపొందింది. అయితే ఒరిజినల్ చిత్రంలోని బలమైన భావోద్వేగాలు, తండ్రి–కూతురు అనుబంధం, కథలోని ఎమోషనల్ ఎలిమెంట్స్‌ను తమిళ వెర్షన్లో దర్శకుడు హెచ్. వినోద్ అదే స్థాయిలో చూపించలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి భాగం వరకు కథ ఆసక్తికరంగా సాగినప్పటికీ, రెండో భాగంలో చేసిన మార్పులు కథనాన్ని బలహీనపరిచాయని సినీ అభిమానులు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. విడుదలైన తొలి రోజే సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో బాక్సాఫీస్‌పై ప్రభావం పడినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.203 కోట్ల థియేట్రికల్ బిజినెస్‌తో విడుదలైన ‘జన నాయకన్’ తన పూర్తి థియేట్రికల్ రన్లో సుమారు రూ.135 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ చిత్రాన్ని విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్లు సుమారు 25 నుంచి 30 శాతం వరకు నష్టాలు చవిచూసినట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ‘జన నాయకన్’కు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ‘భగవంత్ కేసరి’ని చూసిన తెలుగు ప్రేక్షకులు, అదే కథను తమిళంలో రీమేక్ చేసి డబ్ చేసి విడుదల చేయడంతో పెద్దగా ఆసక్తి చూపలేదని విశ్లేషిస్తున్నారు.తాజా సమాచారం ప్రచారం ప్రకారం, తెలుగు థియేట్రికల్ హక్కులు రూ.14 కోట్లకు అమ్ముడవగా, బాక్సాఫీస్ వద్ద సినిమా సుమారు రూ.6 కోట్ల వసూళ్లకే పరిమితమైందని సమాచారం. సినిమాలకు గుడ్‌బై చెప్పి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లిన విజయ్‌కు ‘జన నాయకన్’ చివరి చిత్రంకి ఆశించిన ఫలితం రాకపోవడంతో కోలీవుడ్‌లో ఈ సినిమా ఫలితం చర్చనీయాంశంగా మారింది.