సిటీబ్యూరో, మార్చి 1(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో ఎటుచూసినా ట్రాఫిక్ రద్దీ కనిపిస్తున్నది. ఎప్పుడు ఏదో ఒక రోడ్డు ప్రమాదం జరుగుతున్నది. అది ఏయే రోజుల్లో, ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయనేది ఎవరూ చెప్పలేకపోయినా.. గత అనుభవాల నేపథ్యంలో అంచనా వేస్తున్నారు హైదరాబాద్ సిటీ కమిషనరేట్ ట్రాఫిక్ విభాగం పోలీసులు. ఇటీవల నిర్వహించిన తాజా అధ్యయనంలో ఆశ్చర్యకరమైన, ఆందోళన కలిగించే అంశాలు వెలుగుచూశాయి. నగరంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో అత్యధికం ఆదివారం, సోమవారం రోజుల్లోనే జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ప్రమాదాలు ఎక్కువగా రాత్రి, ప్రత్యేకించి అర్ధరాత్రి జరుగుతాయని చర్చ ప్రజల్లో ఉన్నప్పటికీ ఈ అధ్యయనంలో మాత్రం ఆశ్చర్యపోయే విధంగా ఉదయం, మధ్యాహ్నల్లోనే ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య కూడా అప్పుడే ఎక్కువగా ఉంటున్నదని పోలీసులు చెప్పారు.
ఆది, సోమవారాల్లోనే..!
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాల తీవ్రతను అంచనా వేసేందుకు ప్రత్యేక అధ్యయనం చేశారు. గత సంవత్సరం నగరంలో నమోదైన మొత్తం 2801 ప్రమాద కేసులను విశ్లేషించగా, వారం మొత్తం మీద ఆదివారం అత్యంత ప్రమాదకరమైన రోజుగా నిలిచింది. సెలవురోజు కావడంతో రోడ్లు ఖాళీగా ఉంటాయని భావించే వాహనదారులు అతివేగంతో దూసుకెళ్లడం వల్ల 448 ప్రమాదాలు జరిగాయి. వారం ప్రారంభంలో ఉండే హడావుడి, ఆఫీసులకు వెళ్లే తొందరలో 433 ప్రమాదాలు సంభవించాయి.
శనివారం వారాంతపు వేడుకలు, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల 408 ప్రమాదాలు నమోదయ్యాయి. మిగిలిన రోజుల్లో మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రమాదాల సంఖ్య సగటున 350 నుంచి 400 మధ్యలో ఉంది. ప్రమాదాలు కేవలం రాత్రివేళల్లోనే కాదు.. గణాంకాల ప్రకారం ఉదయం, మధ్యాహ్నం వేళల్లో కూడా జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఉదయం 9-10 గంటల మధ్య ఆఫీసు రద్దీ సమయం కావడంతో అత్యధికంగా 156 ప్రమాదాలు జరిగాయి. మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్య ఎండ తీవ్రత లేదా అలసట వల్ల ఏమరుపాటుగా ఉండడంతో 151 ప్రమాదాలు సంభవించాయి. రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య పనిముగించుకుని ఇంటికి వెళ్లే తొందరలో 149 ప్రమాదాలు నమోదయ్యాయి.
ప్రమాదాలకు కారణాలివే..
రహదారులు ఖాళీగా కనిపిస్తే చాలు,, వేగం పెంచుతున్న వాహనదారులు జంక్షన్ల వద్ద రెడ్ సిగ్నల్ పడినప్పటికీ దూసుకెళ్తున్నారు. అకస్మాతుగా గల్లీల నుంచి వచ్చి రోడ్డుపై వెళ్లే ఇతర వాహనాలను ఢీకొడుతున్నారు. వేగాన్ని కంట్రోల్ చేయలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సిటీ ట్రాఫిక్ పోలీసులు నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు ప్రధానంగా మూడు కారణాలను గుర్తించారు. ఖాళీ రోడ్లు కనిపించగానే ఎక్సలేటర్ పెంచడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకపోవడం, రాంగ్రూట్లో రావడం, అజాగ్రత్తగా యూటర్న్ తీసుకోవడం వంటి కారణాలతో పాటు వారాంతాల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. పెరుగుతున్న ప్రమాదాలను అదుపు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ చర్యలను ముమ్మురం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే నగరంలో 600కి పైగా ప్రమాదాలు జరగడం పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పెంచడంతోపాటు, నిబంధనలు ఉల్లంఘించే వారికి జైలుశిక్షలు కూడా విధిస్తున్నారు. రోడ్డుపై మీ కోసం ఎదురుచూసే కుటుంబసభ్యులను గుర్తుంచుకోండని, వేగం కంటే ప్రాణం ముఖ్యమని పోలీసులు సూచిస్తున్నారు.
ఏయే సమయాల్లో..!
ఏయే రోజుల్లో ఎన్ని ప్రమాదాలు..!
ఆదివారం : 448
సోమవారం : 433
మంగళవారం : 413
బుధవారం : 371
గురువారం : 356
శుక్రవారం : 372
శనివారం : 408