Anushka Shetty | ఈ శుక్రవారం విడుదల కానున్న తెలుగు చిత్రాల్లో ‘కింగ్ జాకీ క్వీన్ (KJQ)’ ఒకటి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ పీరియాడిక్ క్రైమ్ డ్రామాపై సినీ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఏమిటంటే.. ప్రముఖ దర్శకుడు కిరణ్ కుమార్ చివరిసారిగా దర్శకత్వం వహించిన సినిమా ఇదే కావడం. దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రమోషనల్ కార్యక్రమంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వెల్లడించిన ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. దర్శకుడు కిరణ్ కుమార్ ఈ కథను దాదాపు 12 ఏళ్ల క్రితమే సిద్ధం చేశారని వెల్లడించారు. అప్పట్లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించాలని భావించిన కిరణ్ కుమార్, కథానాయిక పాత్ర కోసం స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ రూపొందించారట. అయితే వివిధ కారణాలతో ఆ ప్రాజెక్ట్ అప్పట్లో సెట్స్‌పైకి వెళ్లలేదు. దీంతో సినిమా నిలిచిపోయినా, దర్శకుడు మాత్రం కథను వదిలిపెట్టకుండా కాలానికి అనుగుణంగా మార్పులు చేస్తూ మరింత బలోపేతం చేశారని తెలిపారు.మొదట అనుష్క కోసం రాసిన పాత్ర, కాలక్రమేణా మార్పులు చెంది ఇప్పుడు నటి యుక్తి తరేజా పోషిస్తున్న పాత్రగా రూపుదిద్దుకుందని సమాచారం. దీంతో ఎన్నో ఏళ్లుగా దర్శకుడు మనసులో ఉన్న కథ చివరకు ‘కింగ్ జాకీ క్వీన్’ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ సినిమాతో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల ఈ చిత్రంతో హీరోగా సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. తొలి చిత్రంతోనే పీరియాడిక్ క్రైమ్ డ్రామా వంటి విభిన్న కథను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది.ఇక హీరో దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటిస్తుండగా, యుక్తి తరేజా కథానాయికగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు పూర్ణచంద్ర తేజస్వి సంగీతాన్ని అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన లభిస్తోంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్, క్రైమ్ డ్రామా, బలమైన కథాంశం, కొత్త నటీనటులు, దర్శకుడు కిరణ్ కుమార్ చివరి చిత్రం అనే అంశాలతో ‘కింగ్ జాకీ క్వీన్’ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఎన్నో ఏళ్ల క్రితం అనుష్క కోసం ప్రారంభమైన ఈ కథ, ఇప్పుడు కొత్త తారాగణంతో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.