Viral News : ఓ ప్రభుత్వ పాఠశాల (Govt School) యాజమాన్యం అర్ధరాత్రివేళ 500 మంది విద్యార్థులకు బలవంతంగా హెయిర్ కట్ (Hair Cut) చేసింది. ట్రిమ్మర్లలో ఛార్జింగ్ అయిపోవడంతో కొందరికి సగం కటింగ్ చేసి వదిలేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ కావడంతో పాఠశాల యాజమాన్యం తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర (Maharastra) లోని చంద్రాపూర్ జిల్లా (Chandrapur District) జంభుల్ఘాట్ (Jambulghat) ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ చర్యపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా విద్యార్థులకు చుండ్రు సమస్యలు ఉన్నాయనే కారణంతో పాఠశాల యాజమాన్యం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జుట్లు కత్తిరించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే మధ్యలోనే ట్రిమ్మర్లలో ఛార్జింగ్ అయిపోవడంతో కొందరు విద్యార్థులకు సగం జుట్టు కత్తిరించి వదిలేశారు. ఆ స్థితిలో ఉన్న విద్యార్థుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.
సగం కటింగ్ చేసిన ఫొటోలతో జనం నుంచి విమర్శలు వస్తాయనే భయంతో అందరికి వెంటనే కటింగ్లు పూర్తిచేయాలని స్కూల్ యాజమాన్యాన్ని ఆదేశించారు. దాంతో రంగంలోకి దిగిన స్కూల్ యాజమాన్యం శనివారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకు సగం కటింగ్ పూర్తయిన విద్యార్థులందరికి కటింగ్లు పూర్తిచేసింది. అయితే విద్యార్థుల నిద్రచెడగొట్టి మరీ ఆదరాబాదరాగా ఈ చర్యకు పాల్పడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై పాఠశాల సూపరింటెండెంట్ ప్రశాంత్ మేశ్రామ్ స్పందిస్తూ.. విద్యార్థుల మేలు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వర్షాకాలంలో వారి జుట్టు కత్తిరించలేదని, ఎండల కారణంగా బయట ఆడుకుని సరిగా తలస్నానం చేయకపోవడంతో చుండ్రు, ఇతర చర్మ సమస్యలు పెరిగాయని తెలిపారు. అందుకే ఈ చర్య తీసుకున్నామని చెప్పారు. సగం కత్తిరించిన ఫొటోలు వైరల్ కావడంతో విమర్శలు వచ్చాయని, విమర్శలు మరింత పెరుగవద్దనే ఉద్దేశంతోనే అర్ధరాత్రి కటింగ్లు పూర్తిచేయాల్సి వచ్చిందని తెలిపారు.
గతంలో ఇదే పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయినా యాజమాన్యం తీరు మారడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై గిరిజన అభివృద్ధి శాఖ అధికారులు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.