కరకగూడెం, అక్టోబర్ 06 : కరకగూడెం మండల వ్యాప్తంగా వర్షాల నేపధ్యంలో సీజనల్ వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. వైరల్ ఫీవర్స్ తో పాటు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని కావునా సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు అన్నారు. ఇటీవల 12 సంవత్సరాల బాలిక జ్వరంతో బాధపడుతూ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. డెంగ్యూ లక్షణాలతో బాధపడుతున్న ఆ చిన్నారికి వైద్యం అందించినప్పటికీ, ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచింది. జ్వరం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, ప్లేట్లెట్స్ తగ్గడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ లేదా గర్తింపు పొందిన, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, నిల్వనీటిలో దోమలు చేరకుండా చూసుకోవడం అలాగే దోమ తెరలు ఉపయోగించడం ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చిని అధికారులు పేర్కొన్నారు.