లండన్: బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్‌ను అక్రమ కేసులతో వేధించడం దుర్మార్గమైన చర్య అని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే సీనియర్ నాయకులు రమేష్ ఇసంపల్లి మండిపడ్డారు. తప్పుడు కేసులు నమోదు చేసి క్రిశాంక్‌ను రాజకీయంగా వేధింపులకు గురిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, ప్రతిపక్ష నాయకుల గొంతును అణిచివేసేందుకు అధికారాన్ని ఉపయోగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని రమేష్ ఇసంపల్లి పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టడం, విచారణల పేరుతో వేధింపులకు గురిచేయడం వంటి చర్యలు తెలంగాణ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తాయని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే సీనియర్ నాయకులు రమేష్ ఇసంపల్లి అన్నారు.
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న మన్నె క్రిశాంక్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక కేసులు, వేధింపులతో ఆయనను అణచివేయాలని ప్రయత్నించడం ప్రభుత్వ అసహనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్నవారు విమర్శలను స్వీకరించాలని, అలాకాకుండా ప్రశ్నించే గొంతులను అణచివేయడం తగదని ఆయన అన్నారు.
తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీఆర్ఎస్ శ్రేణులు, ప్రవాస తెలంగాణ సమాజం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రమేష్ ఇసంపల్లి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎన్ఆర్ఐలు తీవ్రంగా ఖండిస్తున్నారని, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం అవసరమైన అన్ని ప్రజాస్వామ్య మార్గాల్లో తమ నిరసనను కొనసాగిస్తామని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయ కక్ష సాధింపు ధోరణిని విడనాడి, మన్నె క్రిశాంక్‌పై నమోదైన కేసులను పునఃసమీక్షించి, రాజకీయ వేధింపులకు స్వస్తి పలకాలని రమేష్ ఇసంపల్లి డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ప్రాధాన్యం కావాలి తప్ప, రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కాదని ఆయన కాంగ్రెస్‌కు సూచించారు.
ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ప్రజలదేనని, అధికార దుర్వినియోగం, అణచివేత రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని రమేష్ ఇసంపల్లి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని, ప్రజా హక్కులను కాపాడే శక్తులకు ప్రజలు ఎప్పటికీ అండగా నిలుస్తారని, సమయం వచ్చినప్పుడు బ్యాలెట్ ద్వారా తమ తీర్పును స్పష్టంగా వెల్లడిస్తారని ఆయన అన్నారు. “ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలని ప్రయత్నించే ఏ ప్రభుత్వానికైనా ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. అక్రమ కేసులతో, బెదిరింపులతో ప్రజల గొంతును అడ్డుకోలేరు” అని రమేష్ ఇసంపల్లి స్పష్టం చేశారు.