AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని కాశీ విశ్వనాథస్వామి ఆలయంలో ఇవాళ (సోమవారం) అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. జిల్లాలోని మనుబోలు బీసీ కాలనీ సమీపంలోగల ఆలయంలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఉదయాన్నే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు నాగుపాములు శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కనిపించాయి. కాసేపు శివలింగాన్ని చుట్టుకొని పడుకున్నాయి.
ఆ తర్వాత మూడు నాగుపాములు శివలింగం ముందు పక్కపక్కనే వరుసగా పడగవిప్పి నిలబడ్డాయి. ఈ నాగుపాములను చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. భక్తితో దండాలు పెట్టుకున్నారు. అనంతరం ఆ మూడు నాగు పాములు ఆలయ పరిసరాల్లోని పుట్టలోకి వెళ్లిపోయాయి. ఈ అరుదైన దృశ్యాలను కొందరు భక్తులు తమ ఫోన్లలో వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. శివయ్యను దర్శించుకుని వెళ్తున్నారు. శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం నాడే ఇలా మూడు నాగుపాములు కనిపించడం దైవ సంకేతంగా భక్తులు భావిస్తున్నారు. అయితే ఈ ఆలయంలో నాగుపాములు కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది మే 17న కూడా అభిషేకం తర్వాత శివలింగంపై ఓ నాగుపాము పడగవిప్పి దర్శనమిచ్చింది.
అలాగే గత ఏడాది అక్టోబర్లో నాగుల చవితి రోజున రెండు నాగుపాములు శివలింగం పక్కన కనిపించి భక్తులను ఆశ్చర్యపరిచాయి. తరచూ ఇలా నాగసర్పాలు దర్శనమివ్వడం ఆ క్షేత్ర మహత్యంగా స్థానికులు చెబుతున్నారు. ఇవాళ శివలింగం ముందు మూడు నాగుపాములు పడగవిప్పి నిలబడిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
శివుని ముందు నాగపాములు..!
నెల్లూరు, మనుబోలు చెర్లోపల్లి గేటు వద్ద విశ్వనాథ స్వామి ఆలయంలోకి తెల్లవారుజామున మూడు నాగుపాములు వచ్చాయి. శివలింగం ఎదురుగా పడగవిప్పి కాసేపు అక్కడే ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
#haraharamahadev #shamboshankara https://t.co/KrZoqJjPvU
— Sanjay Journalist (@SanjuJournalist) October 5, 2026