AP News : వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (YCP chief) వైస్ జగన్ (YS Jagan) బీసీ ద్రోహి అని తెలుగుదేశం పార్టీ (TDP) ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న (Budda Venkanna) విమర్శించారు. జగన్ ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఐదేళ్ల పాలనలో బీసీలకు న్యాయం చేస్తానని చెప్పిన జగన్ మోసం చేశారని వెంకన్న ఆరోపించారు.
ఓటమి భయంతో వైసీపీ తన అభ్యర్థులను నిలబెట్టే పరిస్థితిలో లేదని, అందుకే పదేపదే కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ ఎన్నికల ప్రక్రియను ఆలస్యం చేయాలని చూస్తున్నదని బుద్ధా వెంకన్న దుయ్యబట్టారు. నవంబర్‌లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే రాష్ట్రానికి రావాల్సిన వందల కోట్ల రూపాయల కేంద్ర నిధులు ఆగిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. వైసీపీ తన ఎన్నికల గుర్తు ఫ్యాన్‌కు బదులుగా గొడ్డలి పెట్టుకోవాలని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
కూటమి ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్ సౌకర్యాలు అందిస్తోందని బుద్ధా వెంకన్న తెలిపారు. బీసీల సమస్యల్లో జోక్యం చేసుకోవద్దని జగన్‌ను హెచ్చరించిన వెంకన్న.. రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఎండగడతామని అన్నారు. పోలీసు యంత్రాంగం బాగా పని చేస్తోంది కాబట్టే వైసీపీ నేతలు రోడ్లపైకి వచ్చి రంకెలు వేస్తున్నారని అన్నారు. పోలీసులు సరిగా పని చేయకపోతే వైసీపీ వాళ్లు రోడ్లపైకి వచ్చే సాహసం కూడా చేసేవారు కాదని చెప్పారు. పోలీసులను విమర్శించే అర్హత వైసీపీ నేతలకు లేదని బుద్ధా వెంకన్న అన్నారు.