ఆవిడే సారథి ఫెరీతో నో వర్రీ
ప్రయాణంలో వేధింపులు ఎదురైనప్పుడు ఒక ఆడపిల్ల చదువు ఆగిపోతుంది. దారిలో భద్రత లేనప్పుడు ఒక మహిళ ఉద్యోగం మానేస్తుంది. మార్గం సురక్షితం కానప్పుడు ఒక స్త్రీ జీవితం అనుమానాస్పదంగా ముగుస్తుంది.ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా వచ్చారు సిస్టర్ రైడర్స్! ‘మన కాళ్ల మీద మనం నిలబడాలంటే మన ప్రయాణాలకు మనమే కెప్టెన్స్' అంటూ దూసుకొచ్చారు.
ప్రయాణంలో వేధింపులు ఎదురైనప్పుడు ఒక ఆడపిల్ల చదువు ఆగిపోతుంది. దారిలో భద్రత లేనప్పుడు ఒక మహిళ ఉద్యోగం మానేస్తుంది. మార్గం సురక్షితం కానప్పుడు ఒక స్త్రీ జీవితం అనుమానాస్పదంగా ముగుస్తుంది.ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా వచ్చారు సిస్టర్ రైడర్స్! ‘మన కాళ్ల మీద మనం నిలబడాలంటే మన ప్రయాణాలకు మనమే కెప్టెన్స్’ అంటూ
దూసుకొచ్చారు. ముగ్గురు ఔత్సాహిక ఆంత్రప్రెన్యూర్ల ఆలోచనతో ప్రారంభమైన ఫిమేల్ ఆన్లైన్ కమూట్ సర్వీస్ ‘ఫెరీ రైడ్స్’ ‘ఆడదానికి ఆడదే రక్షణ’ అని చాటుతున్నది. ‘మా చేతికి వచ్చాయి తాళాలు… ఇక పెంచాలి ఈ-బైక్ స్పీడు’ అంటున్న సిస్టర్ రైడర్స్ విద్యుత్ వాహనాలపై దుసుకుపోతూ మహిళలను సురక్షితంగా గమ్యానికి చేరుస్తున్నారు.
భద్రతలేని ప్రపంచంలో బాధ్యతలు నెరవేర్చడం ఎంత కష్టమో తెలుసుకోవాలంటే తెల్లవారుజామున ప్రయాణం చేసే మహిళల్ని చూడాలి. రైడ్ బుక్ అవ్వగానే కెప్టెన్ డిటెయిల్స్ చూసుకుంటారు. దగ్గరికి రాగానే వెహికిల్ నంబర్ సరిపోల్చుకుంటారు. ఒక్కోసారి రైడర్ వేరే వాహనంతో వస్తాడు. కాదు కూడదంటే కయ్యానికి దిగుతాడు. రైడ్ క్యాన్సిల్ చేస్తే డ్యూటీకి లేటవుతుంది. చేయని తప్పునకు శిక్ష భరించలేక బైక్, ట్యాక్సీ ఎక్కారా. ప్రయాణం అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. రైడ్ మొదలవ్వగానే వాహనం ఎక్కడ దారితప్పుతుందోనని భయంతో మ్యాప్‌లో చూసుకుంటూ పోతారు. అనుమానం వస్తే ఎస్ఓఎస్ బటన్‌పై వేలుపెట్టి అప్రమత్తంగా ఉంటారు.
ఇలాంటి ప్రయాణాలు నరకప్రాయం. కానీ, తప్పదు. డ్రైవింగ్ రాక, వాహనం లేక మహిళలు పడే ఇబ్బందులు ఇన్నీ అన్నీ కావు. గాల్లో తేలిపోయే మగవాళ్లకు ఈ బాధలు అర్థం కాకపోవచ్చు. కోడి కూయకముందే లేచి, తెల్లవారక ముందే పని ప్రదేశానికి చేరుకునేటప్పుడు తమకు ఎదురయ్యే కష్టాలు మగవాడికి కూడా రాకూడదని ఆడవాళ్లు కోరుకుంటున్నారు! ప్రజా రవాణాని ఉపయోగించే ప్రతి పదిమంది మహిళల్లో ఎనిమిదిమంది ఏదో ఒక రూపంలో దాడిని ఎదుర్కొంటున్నవాళ్లే. అందుకే ఎక్కడికైనా బయల్దేరితే ‘జాగ్రత్త’ అంటూ ఆత్మీయులు వీడ్కోలు చెబుతుంటారు. ఒంటరి ప్రయాణంలో జాగ్రత్తలు అవసరం. ప్రజా రవాణాలో అంతకన్నా ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సి రావడమే మహిళల ఆలోచనల్ని ఇంకా అభద్రతలోకి నెడుతున్నది.

Fery
అలా మొదలైంది..
‘నేరస్తుడిలో పరివర్తన రావాలని కోరుకోవాలి. కానీ, అతనిలో కలిగే మార్పుతోనే మీ జీవితాల్లో మార్పు సాధ్యమని ఎదురుచూడకండి’ అని ప్రయాణాల్లో ఇబ్బందులు పడే మహిళలకు అజయ్ కుమార్ సలహా ఇస్తున్నాడు. అజయ్ చండీగఢ్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు.. తన స్నేహితురాలు కంగారు పడుతూ కోచింగ్ సెంటర్‌కు వచ్చింది. ఆమెను చూసి అజయ్ షాకయ్యాడు. తను బైక్ ట్యాక్సీపై ప్రయాణించింది. ఆ ట్యాక్సీ రైడర్ ఆమెను పదే పదే తాకుతూ ఇబ్బందిపెట్టాడు. అతణ్ని ఎదిరించలేకపోయిందామె. అలాగని భరించలేకపోయింది. చేసేది లేక దారి మధ్యలోనే బైక్ దిగింది. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చింది. ప్రయాణంలో తాను ఎదుర్కొన్న సమస్యల్ని అజయ్‌తో చెప్పింది.
అప్పుడే దానికో పరిష్కారాన్ని ఆలోచించాడు అతను. ఎంబీఏ పూర్తి అయిన తర్వాత విద్య అనే బ్యాచ్‌మేట్‌తో ఆలోచన పంచుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఇద్దరూ కలిసి ఓ యాప్‌ని రూపొందించారు. డ్రైవింగ్‌లో పర్ఫెక్ట్ అయిన మహిళలకు ఎలక్ట్రిక్ బైక్, కార్లు ఇచ్చారు. వాళ్లకు కమ్యూట్ ట్రాన్స్పోర్ట్ గురించి శిక్షణ ఇచ్చారు. మహిళా రైడర్స్‌తో ఓ పైలట్ ప్రాజెక్ట్‌కి సిద్ధమయ్యారు. పింక్ కలర్ డ్రెస్‌లో, పింక్ హెల్మెట్ పెట్టుకుని రోడ్లెక్కిన మహిళా రైడర్స్‌ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
‘ఎంతకాలం సేఫ్టీ గురించి ఆలోచిస్తారు? ఇంకెన్నాళ్లీ ఎదురుచూపులు? అత్యాశ కాకపోతే.. మగవాళ్లు మారాలని ఎదురుచూస్తూ ఎందుకు ఉండాలి? అవే బాధలు అనుభవిస్తూ ఎందుకు ప్రయాణించాలి? మనమే మారాలి. మన కోసం మనం రైడ్స్ వేయాలి’ అంటూ ‘సిస్టర్ రైడర్స్’ రయ్ రయ్ అంటూ దూసుకొచ్చారు. వాళ్ల మాటలు ఉద్యోగాలు, ప్రయాణాలు చేసే మహిళలను ఆకర్షించాయి. ‘ఆడదానికి ఆడదే రక్షణ’ అని భావించారు. ఆరు నెలల్లో ఆరు వేల మంది విద్యార్థులు, రెండు వందల మంది మహిళా ఉద్యోగులు ఈ యాప్ కమ్యూట్ సర్వీస్‌ని ఉపయోగించి ప్రయాణించారు. ‘సిస్టర్ రైడర్స్ మా ప్రయాణాన్ని సుఖమయం, సంతోషమయం చేశారు’ అంటూ మెచ్చుకున్నారు.

Fery
సేఫ్టీకి రాచబాట
ఫెరీ రైడ్స్ యాప్‌కి తొంబై ఎనిమిది శాతం స్ట్రయిక్ రేటింగ్ వచ్చింది. ఈ విజయంతో శక్తిని కూడదీసుకునేందుకు హిమాన్షు చౌబేతో కలిసి ఫెరీ రైడ్స్ మొబిలిటీ సర్వీస్‌ని స్థాపించారు. గురుగ్రామ్‌లో డ్రైవింగ్ బూత్‌లు ఏర్పాటు చేసి ఎలక్ట్రిక్ ట్యాక్సీ బైక్, క్యాబ్ సర్వీసులు ప్రారంభించారు. ఇందులో అన్నీ విద్యుత్ వాహనాలే వినియోగిస్తున్నారు. కెప్టెన్లు అందరూ మహిళలే. ఉద్యోగాలు చేసే మహిళలు ‘షెడ్యూల్డ్ రైడ్స్’ని ఎంచుకున్న వాళ్ల ఇంటి ముందుకు వాహనం వస్తున్నది.
సిస్టర్ రైడర్ సకాలంలో ఆఫీస్‌కి చేరుస్తున్నది. అభద్రతకు తావులేని సౌకర్యవంతమైన ప్రయాణం చేస్తూ ఆఫీస్‌లకు చేరుకుంటున్నారు. షాపింగ్, సినిమా, ఫంక్షన్ కోసం ఎప్పుడో ఒకప్పుడు బయటికి వెళ్లే మహిళలు ఆన్ డిమాండ్ రైడ్ ఉపయోగించుకుంటున్నారు. వ్యాపారాలు చేసే మహిళలు, పెద్ద సంస్థల్లో నాయకత్వ స్థానాల్లో ఉన్న మహిళలు గంటల లెక్క కార్, బైక్‌లను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ విధానం వల్ల ఒకే వాహనంలో అనేక ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారు.
ఒకే కెప్టెన్ డ్రైవింగ్‌కి వస్తారు. కాబట్టి బుకింగ్, వెయిటింగ్ సమస్యలు లేకుండా సకాలంలో మీటింగ్‌లకు హాజరువుతున్నారు. సురక్షితంగా ఇంటికి చేరుకుంటున్నారు. మహిళల స్వేచ్ఛ, సాధికారతకు దోహదపడే సురక్షితమైన ప్రయాణాన్ని ముగ్గురు యువ ఆంత్రప్రెన్యూర్లు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మహిళలకు భద్రతతోపాటు ఉపాధి కూడా ఉన్న ఫెరీ రైడ్స్‌కి స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ నుంచి రూ.50 లక్షల నిధులు అందాయి. మరో రూ.2 కోట్లు ఇండియన్ ఏంజెల్ నెట్వర్క్ పెట్టుబడి పెట్టింది. ఈ నిధులతో ఫెరీ రైడ్స్ యాక్సెలరేషన్ పెంచింది. ఈ ప్రోత్సాహంతో ఫెరీ రైడ్స్ సేవలు ఢిల్లీ, నోయిడాలకు విస్తరించాయి. మహిళల భద్రతకు మేలైన ఈ రాచబాట మరెన్నో నగరాలకు విస్తరిస్తే మహిళల ప్రయాణాలకు బ్రేకులుండవు. భయాలుండవు.
సాధికార ప్రయాణం
సిస్టర్ రైడర్స్ రాకతో అర్థరాత్రి, అపరాత్రి అని లేకుండా ధైర్యంగా ప్రయాణించే అవకాశం చిక్కింది. కాబట్టి నైట్ షిఫ్ట్‌లకు కూడా మహిళలు సిద్ధపడుతున్నారు. ఇది కార్యాలయాల్లో, మాల్స్‌లో మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచింది. ఫెరీ రైడ్స్ భద్రతకు భరోసా వచ్చింది. కాబట్టి ఉద్యోగాలు చేసే మహిళలకు కుటుంబాల నుంచి మద్దతు లభించింది. ఫెరీ రైడ్స్ కొందరికి ఉపాధి కల్పిస్తే… మరెందరికో ఉపాధికి రాచబాట వేసింది. సుఖవంతమైన, సంతోషకరమైన ప్రయాణంతో ఎన్నో కుటుంబాల్లో ఆనందాలు నింపింది. మహిళలకు స్వేచ్ఛ, అవకాశాలు, సాధికారత కల్పిస్తున్న ఫెరీ రైడ్స్ ప్రయాణం భద్రంగా, పర్యావరణహితంగా, గౌరవప్రదంగా కొనసాగుతూనే ఉంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

