Varun Tej | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన వరుస ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన గత సినిమాల పరాజయాలపై వరుణ్ తేజ్ ఎంతో నిజాయితీగా స్పందించారు. ‘మట్కా’, ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘గాండీవధారి అర్జున’ వంటి చిత్రాలు ఎందుకు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయో తనదైన విశ్లేషణ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘మట్కా’ సినిమాపై మొదటి నుంచే ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి కనిపించలేదని వరుణ్ తెలిపారు. ట్రైలర్ విడుదలైన తర్వాత వచ్చిన స్పందన చూసి, తన నుంచి ప్రేక్షకులు అలాంటి సీరియస్ కథలను ఆశించడం లేదనే విషయం అర్థమైందన్నారు.
సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే స్థాయిలో లేకపోవడం కూడా పరాజయానికి ప్రధాన కారణమని ఆయన అంగీకరించారు. రొటీన్‌కు భిన్నంగా కొత్త తరహా సినిమాలు చేయాలనే ఉద్దేశంతో ‘మట్కా’, ‘గాండీవధారి అర్జున’, ‘ఆపరేషన్ వాలెంటైన్’ వంటి చిత్రాలు చేశానని వరుణ్ చెప్పారు. అయితే ఆ సినిమాలు కేవలం ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే నచ్చాయని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయని వెల్లడించారు. ఒక సినిమా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేయగలిగేలా ఉండాలి. ప్రేక్షకులు థియేటర్‌కు వస్తే ముందుగా వినోదాన్నే ఆశిస్తారు. ఆ బేసిక్ పాయింట్‌ను నేను మిస్ అయ్యాను అని వరుణ్ తేజ్ అన్నారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదంటే, అందులో తమవైపు తప్పులు ఉన్నట్టేనని ఆయన నిజాయితీగా ఒప్పుకున్నారు.ప్రేక్షకుల అభిరుచి నిరంతరం మారుతూ ఉంటుందని, ఆ మార్పులను అర్థం చేసుకుని సినిమాలు చేయాల్సిన అవసరం ఉందని వరుణ్ అభిప్రాయపడ్డారు. గత వైఫల్యాలు తనకు విలువైన పాఠాలు నేర్పాయని, ఇకపై వినోదానికి పెద్దపీట వేసే కథలను ఎంచుకుంటానని చెప్పారు. తన కొత్త చిత్రం ‘కొరియన్ కనకరాజు’ పూర్తి స్థాయి ఎంటర్టైనర్గా ఉంటుందని వరుణ్ తేజ్ ధీమా వ్యక్తం చేశారు. అన్ని వయసుల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను రూపొందించామని, కుటుంబ సభ్యులంతా కలిసి నవ్వుకుంటూ ఆస్వాదించేలా కథను డిజైన్ చేశామని తెలిపారు. ఈ చిత్రంతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించి మళ్లీ విజయాల బాట పట్టాలని ఆశిస్తున్నట్లు వరుణ్ తేజ్ వెల్లడించారు.