రియాద్, సెప్టెంబర్ 16: ముస్లింల పవిత్ర నగరమైన మక్కా లక్ష్యంగా హౌతీలు బుధవారం దాడి చేసినట్టు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఆరోపించింది. ఈ ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలలో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. దీంతో ఈ ప్రాంతాన్ని అల్లకల్లోలం చేస్తున్న సంఘర్షణను మరింత తీవ్రతరం చేశాయి. కాగా, మక్కా లక్ష్యంగా తాము దాడులు చేశామంటూ రియాద్ చేస్తున్న ఆరోపణలను హౌతీలు ఖండించారు. సౌదీ నగరం మక్కా లక్ష్యంగా తాము ప్రయోగించిన డ్రోన్‌ను కూల్చివేశామని రియాద్ చేసిన ప్రకటన అబద్ధమని హౌతీ స్పష్టం చేసింది.
‘మక్కాను లక్ష్యంగా చేసుకున్నారన్న ఆరోపణలు గతంలోనూ వాడిన పాత అబద్ధాలే. అవి ఇక ఎవరినీ మోసం చేయలేవు’ అని హౌతీల పొలిట్‌బ్యూరోకు చెందిన హజీమ్-అల్-అస్సాద్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఎర్ర సముద్రం మీదుగా పోయే నౌకలపై దిగ్బంధాన్ని ప్రకటించిన హౌతీలు ఆ దేశానికి సవాల్‌గా మారారు. గత వారం మెరుపు దాడులు నిర్వహించిన హౌతీలు యెమెన్‌లోని ఎర్రసముద్ర తీరం, బాబ్ ఎల్-మాండెబ్ జలసంధిని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.