‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్టుగా ఉన్నది సీఎం రేవంత్‌రెడ్డి తీరు. పాలన చేతకాక, క్షేత్రస్థాయి సమస్యలను పరిషరించలేక, తప్పులన్నింటినీ కప్పిపుచ్చేందుకు ఎదుటివారిపై నిందలు మోపే దిగజారు డు రాజకీయాన్నే ఇంకా పట్టుకొని వేలాడుతున్నారు. రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం ‘22ఏ’ పిడుగు వేసిన ప్రభుత్వం.. వారి భూములను అన్యాయంగా నిషేధిత జాబితాలో పెట్టింది. దీంతో అవసరానికి అమ్ముకోలేక తల్లడిల్లిన రైతులు.. ఆగ్రహంతో ప్రభుత్వంపై మర్లవడ్డారు. ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకొనేందుకు సీఎం ‘ఎర్రవల్లి’ డైవర్షన్ డ్రామా అస్త్రం ఎంచుకున్నారు. విచారణ పేరుతో సరికొత్త నాటకానికి తెర తీశారు. ఆ తొందరపాటులో అసెంబ్లీ వేదికగా ప్రవేశపెట్టిన కాగితాలు ఆయన మెడకే చుట్టుకున్నాయి. ఇన్నాళ్లూ కేసీఆర్‌కు ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల భూమి ఉన్నదని, అందులో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని ఊరూరా చేసిన ప్రచారం అబద్ధమని అధికారిక రికార్డులు నిరూపించాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): కేసీఆర్‌కు ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల సామ్రాజ్యం ఉన్నదని, గడీ నిర్మించుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదే పదే ప్రచారం చేశారు. మైకులు దొరికిన ప్రతిచోట, అవకాశం ఉన్న ప్రతి చోటా అదే చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ శాసనసభ వేదికపైకి వచ్చేసరికి రేవంత్‌రెడ్డి స్వరం మారింది, సంఖ్య కుంచించుకుపోయింది. సిద్దిపేట జిల్లా మరూక్, మిట్టపల్లి, వెంకటాపూర్ గ్రామాల పరిధిలో కేసీఆర్, ఆయన సతీమణి శోభ పేరిట ఉన్నది కేవలం 67.5 ఎకరాలు మాత్రమేనని స్వయంగా సభలో చదివి వినిపించారు. అందుకు ఏవో పత్రాలు చూపించారు.
అయితే అది కేసీఆర్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో బహిరంగంగా డిక్లేర్ చేసిన పట్టా భూమే కావడం విశేషం. గత ఎన్నికల అఫిడవిట్లలో కేసీఆర్ చట్టబద్ధంగా పేర్కొన్న వివరాలకు, సభలో ప్రభుత్వం వెల్లడించిన 67.5 ఎకరాలకు లెక్క సరిపోయింది. కానీ ప్రజల ముందు రేవంత్‌రెడ్డి హోరెత్తించిన భారీ సంఖ్యకు, అసెంబ్లీలో చెప్పిన లెక్కలకు మాత్రం పొంతన కుదరడం లేదు. వెయ్యి ఎకరాలు, 700 ఎకరాలు, 340 ఎకరాలు అంటూ ఇన్నాళ్లు చేసిన ప్రకటనలకు రెవెన్యూ రికార్డుల ఆధారం ఏమిటో స్పష్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఆ భూమి ఏ సర్వే నంబర్లలో ఉన్నది? ఎవరి ఆధీనంలో ఉన్నదో చెప్పకుండా కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితం అయ్యారు.
రైతులే సాక్ష్యం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ప్రభుత్వ భూమి ఉన్నదంటూ రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనలన్నీ రాజకీయ పైశాచికత్వమేనని క్షేత్రస్థాయి వాస్తవాలు స్పష్టంచేస్తున్నాయి. ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్, మరూక్ గ్రామాల పరిధిలో కేసీఆర్‌కు భూములు విక్రయించిన రైతులు స్వయంగా మీడియా ముందుకొచ్చి నిజాలు వెల్లడిస్తున్నారు. తాము రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా చట్టబద్ధంగా విక్రయించిన పట్టా భూములే తప్ప, అకడ ఒక గుంట కూడా అసైన్డ్ భూమి గానీ, ప్రభుత్వ భూమి గానీ లేదని వారు స్పష్టం చేస్తున్నారు. పట్టా భూములకు అక్రమాల రంగు పులిమి, ప్రభుత్వ భూమి ఉన్నట్టు భ్రమలు కల్పించడం ద్వారా రేవంత్‌రెడ్డి తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అఫిడవిట్లకే అక్రమాల ముద్ర
బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల కమిషన్‌కు అఫిడవిట్ల రూపంలో బహిరంగంగా ఇచ్చిన వివరాలనే ఏదో రహస్య పత్రాల్లా సీఎం సభలో చదివి వినిపించారు. కేటీఆర్ కుటుంబానికీ భూములున్నాయని చెప్పారు. ఈ భూములు పూర్తిగా చట్టబద్ధమైనవే. పూర్వీకుల నుంచి సంక్రమించిన, రిజిస్ట్రేషన్ల ద్వారా కొనుగోలు చేసిన ఆస్తులు. సీఎం వీటిని నేరపూరితమైనవిగా చిత్రీకరించి సభను, సభాపతిని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. హరీశ్‌రావు, ఆయన భార్య పేరిట రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో కలిపి ఉన్న 30.16 ఎకరాల పట్టా భూమిపై కూడా బురదజల్లారు. సిద్దిపేట నిధులతో రోడ్లు వేశారని చెప్పిన సీఎం అందుకు సంబంధించిన ఒక జీవో గానీ, ఒక ఆధారాన్ని కానీ బయటపెట్టలేకపోయారు. వీరే కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేసిన నేతలందరూ ఎన్నికల అఫిడవిట్లలో చూపెట్టిన వివరాలనే పట్టుకొచ్చి, అవన్నీ అక్రమం అన్నట్టుగా చిత్రీకరించబోయారు.
బంధువులు, సామాజికవర్గం పేరిట..
కల్వకుంట్ల కుటుంబం పరిధిని పెంచి, పెద్ద ఎత్తున భూములున్నట్టు చూపేందుకు రేవంత్‌రెడ్డి అనేక విన్యాసాలు చేశారు. పెండ్లయ్యి, పిల్లలతో వేరుగా ఉంటున్న ఆడపడుచులు, అత్తగారింటికి వెళ్లిపోయిన వారు, అల్లుళ్లు, సడ్డకుల కొడుకులను కూడా తీసుకొచ్చి ‘కేసీఆర్ కుటుంబం’ అంటూ అడ్డగోలుగా కలిపారు. అంతేకాదు, వెలమ సామాజిక వర్గానికి చెందిన మరికొందరి ఆస్తులను కూడా జత చేశారు. కవిత పేరిట ఐదు జిల్లాల్లో ఉన్న 37.26 ఎకరాలు, సంతోష్ రావు కుటుంబానికి ఐదు జిల్లాల్లో ఉన్న 79.20 ఎకరాలు, నవీన్‌కుమార్, కొండల్రావు పేరిట ఉన్న 101.14 ఎకరాల ఆస్తులన్నింటినీ కట్టగట్టి ప్రచారం చేశారు. ఇదే సూత్రం వర్తింపజేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, బల్మూరి వెంకట్ కుటుంబాల ఆస్తులను కూడా కలిపి లెకిస్తారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
దళితుల పేరుతో రాజకీయ మోసం
కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంపై విచారణకు ముగ్గురు మంత్రులతో విచారణ చేయిస్తామని, ప్రభుత్వ భూమి ఉంటే స్వాధీనం చేసుకొని దళితులకు పంచుతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం పబ్లిసిటీ స్టంట్ అని రాజకీయ పరిశీలకులు ఎద్దేవా చేస్తున్నారు. కలెక్టర్లకు నోటీసులు ఇవ్వాలని అసెంబ్లీ సాక్షిగా అల్టిమేటం జారీ చేయడం, 30 రోజుల్లో నివేదిక ఇవ్వకపోతే అధికారులపై చర్యలు తప్పవని బెదిరించడం ఆయన అసహనాన్ని, అభద్రతా భావాన్ని తేటతెల్లం చేస్తున్నాయన్నారు. చట్టబద్ధమైన విచారణ జరుగకముందే, ప్రభుత్వ భూమి ఉన్నదని తేలకముందే ‘భూమిని స్వాధీనం చేసుకుని దళితులకు పంచుతాం’ అని ప్రకటించడం దళితవర్గాలను మరోసారి వంచించడమే అని స్పష్టం చేస్తున్నారు. అసలు ప్రభుత్వ భూమే లేని చోట ఎక్కడినుంచి తెచ్చి ఇస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ భూమి లేకపోతే.. సీఎం అసెంబ్లీలో ప్రకటించిన 388 ఎకరాలను మరోచోట సేకరించి, దళితులకు పంచుతానని హామీ ఇవ్వగలరా? అని నిలదీస్తున్నారు. ప్రభుత్వం 22ఏ నిషేధిత భూముల కుంభకోణంలో చికుకున్న సమయంలో, ప్రతిపక్షాలు చేస్తున్న ప్రజా పోరాటానికి సమాధానం చెప్పలేక, ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్‌రెడ్డి ఈ ‘డైవర్షన్ పాలిటిక్స్’కు తెరతీశారని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.