ముంబై, సెప్టెంబర్ 16: దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. గత కొన్ని రోజులుగా నష్టాల్లో కదలాడిన సూచీలకు బ్యాంకింగ్ షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్లు ఆశాజనకంగా ఉండటం కలిసొచ్చింది. దీంతో ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరికి మార్కెట్ ముగిసే సమయానికి 332.63 పాయింట్లు అందుకొని 74,336.45 వద్ద స్థిరపడింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 99 పాయింట్లు పెరిగి 23,217.60 వద్ద ముగిసింది.
సూచీల్లో ఐటీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ట్రెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, ఐటీ రంగ షేర్లు కుదేలయ్యాయి. ప్రధానంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టపోయాయి. బ్యాంకింగ్ షేర్లతోపాటు హెవీవెయిట్ షేర్లు లాభాల్లో ముగియడం కలిసొచ్చిందని, ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ 56 వేల మార్క్‌ను దాటడం కూడా తిరిగి లాభాల్లోకి రావడానికి ప్రధాన కారణమని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడం మదుపర్లను కొనుగోళ్ల వైపు నడిపించాయన్నారు.
రంగాలవారీగా బీమా సూచీ అత్యధికంగా 2.05 శాతం లాభపడగా, ఎఫ్ఎంసీజీ 1.44 శాతం, పీఎస్‌యూ బ్యాంకింగ్ 1.14 శాతం, రియల్టీ, బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, ఫోకస్డ్ ఐటీ, ఐటీ, పవర్, హౌసింగ్ ఫైనాన్స్, ఇండస్ట్రియల్స్, హాస్పిటాల్టీ సూచీలు నష్టపోయాయి.