రాంచీ: రిక్రూట్మెంట్ పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్న ఆరోపణలపై జార్ఖండ్(Jharkhand)లో విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు విద్యార్థులు అంగీకరించారు. కానీ సీఎం హేమంత్ సోరెన్‌తో జరిగే చర్చలను మీడియా ముందు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తలుపుమూసి చర్చలు నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. జార్ఖండ్ సర్కారు నిర్వహించిన జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ, సీజీఎల్ పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు నిరసనకారులు ఆరోపించారు. రాంచీలో గత 12 రోజులుగా ధర్నా చేస్తున్నారు. బుధవారం ప్రభుత్వంతో నిరసనకారులు భేటీ అయ్యారు. త్వరలోనే ప్రభుత్వంతో ఓ బృందం కలవనున్నట్లు చెప్పారు.
ఓపెన్ ప్లాట్ఫామ్లో తమతో మీడియా ముందు డిస్కస్ చేసేందుకు సీఎం రావాలని, అప్పుడే సరైన తీర్మానం వీలు అవుతుందని ఆందోళనకారులు తెలిపారు. క్లోజ్డ్ డోర్ చర్చలు వద్దు అని, ఓపెన్‌గా చర్చలు జరగాలని నిరసనకారులు అన్నారు. మీడియా ముందే సీఎం తమ డిమాండ్లను వినాలని, గడిచిన 26 ఏళ్ల నుంచి జార్ఖండ్ విద్యార్థులు మూసిన డోర్లలోనే మగ్గిపోయారని ఓ నిరసనకారుడు అన్నారు. సీఎం హేమంత్ సోరెన్‌తో జరిగే చర్చల్లో కనీసం ఇద్దరు మీడియా ప్రతినిధులు ఉండాలని స్టూడెంట్ నేత రవీంద్ర పాశ్వాన్ తెలిపారు.