Konda Laxman Bapuji | తెలంగాణ ఉద్యమ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ కోసం బాపూజీ చేసిన త్యాగాలను, ప్రజా ఉద్యమాల్లో ఆయన పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ పదవుల కంటే ప్రజల పక్షాన నిలబడటమే నాయకత్వమని తన ఆచరణతో చూపిన గొప్ప దార్శనికుడని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఆయన జీవితం నిరంతర పోరాటంగా సాగిందన్నారు.
1969 తెలంగాణ ఉద్యమ సమయంలోనే బాపూజీ తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నారని హరీశ్‌రావు గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాలు, చేనేత కార్మికుల పట్ల ఆయనకున్న నిబద్ధత స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ.. వర్ధంతి సందర్భంగా మహనీయుడికి ఘన నివాళులు అర్పించారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యమాలనే ఊపిరిగా, పోరాటాలనే పరమావధిగా జీవించిన ధీశాలి అని కేటీఆర్ పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ప్రజా ఉద్యమాల్లో ఆయన పాత్ర మరువలేనిదన్నారు.
జలదృశ్యంలోనే టీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిందని కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యంలోనే ఏర్పడిందని, అక్కడి నుంచే మలిదశ తెలంగాణ ఉద్యమానికి బీజం పడిందని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన అనంతరం అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని కేటీఆర్ గుర్తుచేశారు. బాపూజీ పేరును రాష్ట్ర హార్టికల్చర్ యూనివర్సిటీకి పెట్టి గౌరవించిందన్నారు.