FRS | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు రేవంత్ సర్కారు భయపడిందా? ఎన్నికల ముందు టీచర్లతో ఎందుకు పెట్టుకోవడమని వెనక్కి తగ్గిందా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. టీచర్లకు అమలు చేయతలపెట్టిన ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ (ఎఫ్ఆర్ఎస్)ను ఉపసంహరించుకోవడమే ఇందుకు తార్కాణంగా నిలుస్తున్నది. ప్రభుత్వ, జిల్లా పరిషత్తు టీచర్లకు అమలు చేయతలపెట్టిన ఎఫ్ఆర్ఎస్ హాజరుపై రేవంత్ సర్కారు వెనక్కి తగ్గింది. ఈ అంశంపై ప్రస్తుతానికి యూటర్న్ తీసుకొన్నది.
ఈ నిర్ణయం తాజా లోక్‌సభ ఎన్నికల్లో తమ కొంపముంచుతుందన్న ఆందోళనతో ఆగమేఘాల మీద ఎఫ్‌ఆర్‌ఎస్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. డీఎస్ఈ -ఎఫ్ఆర్ఎస్ యాప్‌లోని స్టాఫ్ రిజిస్ట్రేషన్, స్టాఫ్ అటెండెన్స్ ఆప్షన్లను తొలగించింది. సర్కారు స్కూళ్లల్లో పనిచేస్తున్న టీచర్లకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలుచేసేందకు విద్యాశాఖ సన్నాహకాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగా డీఎస్ఈ – ఎఫ్ఆర్ఎస్ యాప్‌ను తీసుకొచ్చారు. అంతకు ముందే అన్ని స్కూళ్ల పర్యవేక్షణకు 19వేలకు పైగాట్యాబ్లను అందజేశారు. ఇటీవలే 4జీ జియో సిమ్‌లు స్కూళ్లకు అందజేశారు. గతంలో స్టూడెంట్ రిజిస్ట్రేషన్, స్టూడెంట్ అటెండెన్స్ అన్న ఆప్షన్స్ ఉండగా వీటికి తోడు ఆయా యాప్‌లో ఇటీవలే స్టాఫ్ రిజిస్ట్రేషన్, స్టాఫ్ అటెండెన్స్ అన్న రెండు ఆప్షన్స్ ఇచ్చారు. ఇదే అంశాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకొచ్చింది. ‘బడికి డుమ్మా కుదరదిక’ శీర్షికతో కథనాన్ని ప్రచురించింది.
ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రాష్ట్రంలోని పలువురు టీచర్లు, కొన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీని అమలుపై బహిరంగంగా మండిపడ్డాయి. ఓటేసినందుకు మమ్మల్ని మోసం చేస్తారా? అంటూ రేవంత్ సర్కారు తీరును దుయ్యబట్టాయి. తాజా పార్లమెంట్ ఎన్నికల్లో తడాఖా చూపిస్తామని హెచ్చరించాయి. ఈ హాజరు విధానంపై పలు ఉపాధ్యాయ వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ చర్చ పెద్ద దుమారాన్ని రేపింది. ఈ నేపథ్యంలో‘ రేవంత్ సర్కారుపై టీచర్ల విముఖత’ పేరుతో మరో కథనాన్ని నమస్తే తెలంగాణ ప్రచురించింది. పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతల అభిప్రాయాలను ఆయా కథనంలో వివరించింది. దీంతో హడలెత్తిపోయిన సర్కారు ఆగమేఘాల మీద ఈ హాజరు విధానాన్ని నిలిపివేయాలని మౌఖిక ఆదేశాలిచ్చింది.