IRIS Lavan : ఇరాన్ యుద్ధనౌక (Iran Warship) లోని అత్యవసరం కాని సిబ్బందిని భారత్ (India) వెనక్కి పంపింది. ఈ నెల 1న ఇరాన్‌కు చెందిన యుద్ధనౌక IRIS లావన్ (IRIS Lavan) లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ఇరాన్ విజ్ఞప్తి మేరకు నౌకను కొచ్చిలో లంగరు వేసేందుకు భారత్‌ను అనుమతించింది. ఈ క్రమంలో ఈ నెల 4 నుంచి IRIS లావన్ 183 మంది సిబ్బందితో సహా కొచ్చిలోనే ఉండిపోయింది.
వారిలో అత్యవసరం కాని సిబ్బందిని భారత్ శనివారం వెనక్కి పంపింది. కాగా మార్చి 4న శ్రీలంక సమీపంలో అమెరికా సబ్‌మెరైన్ దాడిలో మునిగిపోయిన ఇరాన్ యుద్ధనౌకలోని సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో గుర్తించిన 80 మంది ఇరానీల మృతదేహాలను తీసుకెళ్లడానికి ఇరాన్ ప్రత్యేక విమానాన్ని పంపించింది. కొలంబో నుంచి ఆ మృతదేహాలను తీసుకొచ్చిన విమానం శుక్రవారం రాత్రి కొచ్చిలో దిగింది. శనివారం IRIS లావన్‌లోని అత్యవసరం కాని సిబ్బందిని తీసుకుని బయలుదేరింది. ప్రస్తుతం IRIS లావన్‌లో 50 మందికిగా అత్యవసర సిబ్బంది ఉన్నట్లు తెలిపింది.
వారు కూడా త్వరలోనే ఆర్మేనియా మీదుగా ఇరాన్‌కు వెళ్లనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నౌకలో ఆర్మేనియాకు రాజధాని యెరెవాన్‌కు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇరాన్‌కు చేరుకుంటారని వెల్లడించాయి.