హైదరాబాద్, ఆగస్టు16 (నమస్తే తెలంగాణ): కృష్ణాజలాల నీటి వినియోగానికి సంబంధించి సోమవారం నిర్వహించ తలపెట్టిన త్రీమెన్ కమిటీ సమావేశాన్ని కేఆర్ఎంబీ మరోసారి వాయిదా వేసింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు సమాచారం పంపింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సమావేశానికి రాలేమని ఏపీ అధికారులు వెల్లడించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సమావేశం వాయిదా పడింది. తదుపరి తేదీని మాత్రం ప్రకటించలేదు.
వాస్తవంగా ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి నీటి వినియోగాలకు సంబంధించి తక్షణ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ సర్కారే తొలుత ప్రతిపాదింది. ఈ నేపథ్యంలోనే కేఆర్ఎంబీ సైతం ఉన్నపళంగా తెలంగాణ అభిప్రాయం తీసుకోకుండానే 13వ తేదీన సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తొలుత ఏకపక్షంగా ప్రకటించింది. కానీ ఏపీ అధికారుల విజ్ఞప్తితోనే ఆ సమావేశాన్ని 17వ తేదీకి వాయిదా వేసింది. తాజాగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మరోసారి వాయిదా పడింది.