Rahul Gandhi : ఢిల్లీలో మంత్రి పర్వేశ్ వర్మ (Parvesh Verma) రోడ్లను తనిఖీ చేస్తుండగా వీడియో తీసిన యువకుడిని అతడు చెంపదెబ్బ కొట్టడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై తాజాగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) స్పందించారు. మంత్రి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నేతలకు ఓటర్లంటే ఏమాత్రం భయం లేదని అన్నారు. తమ పార్టీ అధికారంలో ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తమ సమస్య గురించి ప్రశ్నించినందుకు ఓ యువకుడిని చెంపదెబ్బ కొట్టడం సరైన చర్య కాదన్నారు.
వీడియోలో ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన బీజేపీ మంత్రి ఒక యువకుడిని చెంపదెబ్బ కొట్టడం కనిపిస్తోందని, అతడు చేసిన నేరం ఏమిటి..? అని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. ప్రజల మధ్యలో ప్రశ్నిస్తే చెంపదెబ్బ.. పేపర్ లీక్స్ గురించి అడిగితే లాఠీఛార్జి.. పార్లమెంట్లో ప్రశ్నిస్తే మైక్ స్విచ్ఛాఫ్ చేయడం.. ఇవన్నీ అధికారం ఉందనే అహంకారంతో చేసే చర్యలన్నారు. తప్పుచేస్తే ప్రజలు తమను గద్దె దించుతారనే భయం వారిలో లేదని విమర్శించారు.
బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చేది ఓటు చోరీతో అని, అందుకే వారికి ప్రజల మద్దతుతో అవసరం ఉండదని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై మంత్రి పర్వేశ్ వర్మ స్పందిస్తూ.. ఇలాంటి విషయాలకు ఆయన దూరంగా ఉండాలని సూచించారు. ఆయనకు ఏమీ తెలియదని, తెలిసీ తెలియక ఏదేదో మాట్లాడుతారని వ్యాఖ్యానించారు.