కుభీర్ : ఆగస్టు 16: తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి మద్యం మత్తులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని మలేగాంవ్ గ్రామంలో చోటు చేసుకుందీ విషాదకరమైన ఘటన. మృతుడిని కుభీర్ మండలం మాలేగాం గ్రామానికి చెందిన పులొల్ల భోజన్న (39)గా గుర్తించారు పోలీసులు.
కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
మాలేగాం గ్రామానికి చెందిన పులొల్ల భోజన్న (39) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యడు. ఆదివారం ఇంటి నుండి బయటకు వెళ్లిన అతడు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలో అంతా వెతికారు. అయితే.. ప్రతిరోజు మద్యం మత్తులో ఉంటున్న భోజన్న జీవితంపై విరక్తి చెంది తన వ్యవసాయ పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు విగతజీవిగా ఉండడం గమనించిన పలువురు శివారు రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు వెంటనే కుభీర్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశారు.
ఎస్సై కృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని, పంచనామ నిర్వహించారు. భోజన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. భోజన్న మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.