Shivam Dube : పొట్టి ప్రపంచకప్‌లో భారత జట్టు విజయాల్లో కీలకమైన శివం దూబే (Shivam Dube)పై ప్రశంసలు కురుస్తున్నాయి. టీమిండియా వరుసగా రెండోసారి విజేతగా నిలవడంలో దూబే కనిపించని హీరో అని మాజీ ఆటగాళ్లు అతడిని ఆకాశానికెత్తేస్తున్నారు. అయితే.. భారత స్టార్ మాత్రం తాను రియల్ హీరోగా భావించే వ్యక్తిని అభిమానులకు పరిచయం చేశాడు. ఆయన ఎవరో కాదు అతడికి జన్మనిచ్చిన తండ్రి.
పొట్టి ప్రపంచకప్ విజేతలుగా ఇళ్లకు చేరుకున్న భారత ఆటగాళ్లు తమ సంతోషాన్ని కుటుంబంతో పంచుకుంటున్నారు. ఆల్‌రౌండర్ శివం దూబే మాత్రం తన తండ్రి రాజేశ్ దూబే(Rajesh Dube) మెడలో ప్రపంచకప్ మెడల్ వేసి సంబురపడ్డాడు. టీమిండియా జెర్సీ ధరించిన తండ్రి మెడలో తనకు బహుమతిగా లభించిన మెడల్ వేసి మురిసిపోయాడు. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు దూబే. ‘నా జీవితలో నిజమైన హీరో’ అనే క్యాప్షన్‌తో అతడు పెట్టిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
ఐపీఎల్ సంచలనంగా భారత టీ20 జట్టులోకి దూసుకొచ్చిన శివం దూబే.. నమ్మదగిన ఆటగాడిగా ఎదిగాడు. రెండేళ్ల క్రితం పొట్టి ప్రపంచకప్‌లో పర్లేదనిపించిన దూబే.. ఈసారి మాత్రం మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగాడు. చేసింది కొన్నిపరుగులే అయినా.. భారత జట్టు విజయానికి అవి ఎంతో కీలకమయ్యాయి.
దూకుడే మంత్రగా 169.06 స్ట్రయిక్ రేటుతో రెండు అర్ధ శతకాలతో కలిపి 235 రన్స్ సాధించాడీ హిట్టర్. వరల్డ్‌కప్ విజేతగా సొంతూరికి రైల్లో వెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచిన దూబే.. ఇంటికి వెళ్లాక తండ్రితో తన సంతోషాన్ని పంచుకున్నాడు.