అబుదాబి: గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలను టార్గెట్ చేస్తూ ఇరాన్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ దాడులకు చెందిన వీడియో(Iran Strikes Videos)లను షేర్ చేస్తున్న 45 మంది యూఏఈ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో వివిధ దేశస్థులు ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చట్టాల ప్రకారం యుద్ధ వీడియోలు షేర్ చేయడం నేరం అవుతుంది. ఇరాన్ చేపడుతున్న దాడులకు చెందిన వీడియోలను ప్రచారం చేయడం వల్ల ప్రజలు భయాందోళనలకు గురయ్యే అవకాశాలు ఉన్నట్లు యూఏఈ చెప్పింది. అయితే ఆ వీడియోలు షేర్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు.
దుబాయ్‌లో 21 మందిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. అందులో ఓ 60 ఏళ్ల బ్రిటీష్ జాతీయుడు కూడా ఉన్నారు. యూఏఈ సైబర్‌క్రైం చట్టాల కింద అతన్ని అరెస్టు చేశారు. యూఏఈ చట్టాల ప్రకారం రెండేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉన్నది. 54 వేల డాలర్ల వరకు ఫైన్ విధించనున్నారు. అవసరం అయితే డిపోర్టు కూడా చేస్తారు.
ఇరాన్ దాడులకు చెందిన వీడియోలను షూట్ చేస్తున్న సుమారు 300 మందిని అరెస్టు చేసినట్లు ఖతార్ సోమవారం పేర్కొన్న విషయం తెలిసిందే. బహ్రెయిన్‌లో కూడా ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. దాడులకు చెందిన వీడియోలను రీపోస్టింగ్ చేయరాదు అని ప్రభుత్వం చెప్పింది.