దీక్ష రోజున కేసీఆర్ షాడో నేనే!
చావుతోనైనా స్వరాష్ట్రం సాధించాలనే సంకల్పంతో 2009 నవంబర్ 29 నుంచి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నారు. కేసీఆర్‌ను అరెస్టు చేసేందుకు నాటి జహీరాబాద్ సీఐ శ్రీధర్‌రెడ్డిని నియమించారు. ఆయన్నే కేసీఆర్‌కు షాడోగా వేశారు. నాడు కేసీఆర్‌ను ఎలా అరెస్ట్ చేసిందీ శ్రీధర్‌రెడ్డి 17 ఏండ్ల తర్వాత ‘నమస్తే తెలంగాణ’తో తన అనుభవాలు పంచుకున్నారు.
- చాకచక్యంగా వ్యవహరించి అరెస్ట్ చేశాం
- మా టీమ్ గురించి కేసీఆర్‌కు తెలుసు
- అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బ్యాచ్ ఉండేది
- నాటి అనుభవాలు పంచుకున్న ఏసీపీ శ్రీధర్
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): చావుతోనైనా స్వరాష్ట్రం సాధించాలనే సంకల్పంతో 2009 నవంబర్ 29 నుంచి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నారు. కేసీఆర్‌ను అరెస్టు చేసేందుకు నాటి జహీరాబాద్ సీఐ శ్రీధర్‌రెడ్డిని నియమించారు. ఆయన్నే కేసీఆర్‌కు షాడోగా వేశారు. నాడు కేసీఆర్‌ను ఎలా అరెస్ట్ చేసిందీ శ్రీధర్‌రెడ్డి 17 ఏండ్ల తర్వాత ‘నమస్తే తెలంగాణ’తో తన అనుభవాలు పంచుకున్నారు.
కేసీఆర్ షాడోగా ఎందుకు ఎంపిక చేశారు?
2009 అక్టోబర్‌లో జహీరాబాద్ సీఐగా బాధ్యతలు తీసుకున్న కొద్దిరోజుల్లోనే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించారు. అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు షాడో టీమ్‌లను ఏర్పాటు చేశారు. అప్పటి ఎస్పీ కాంతారావు కాల్ చేసి ‘నిన్ను కేసీఆర్‌కు షాడోగా నియమిస్తున్నాం. ఉన్నపళంగా సిద్దిపేటకు వచ్చెయ్’ అని చెప్పారు. రాత్రింబవళ్లు కేసీఆర్ ఏం చేస్తున్నారనే ఆలోచనలే. ఆయన దినచర్య మొత్తం ఉన్నతాధికారులకు పంపాలి.
ఆ విషయం కేసీఆర్‌కు తెలుసా?
ఆయన దీక్ష ప్రకటించిన తర్వాత వరంగల్ వెళ్లారు. ఆ తర్వాత కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటికి వెళ్లి, ఉద్యమ కారార్యచరణపై చర్చించారు. ఆ తర్వాత ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఎవరెవరికి ఏ అధికారి షాడోగా ఉన్నారో కేసీఆర్‌కు మొత్తం తెలిసిపోయింది’
కేసీఆర్ మిమ్మల్ని ఏమీ అనలేదా?
ఎవరిపైనా కక్ష తీర్చుకొనే అలవాటు ఆయనకు లేదు. సంతోష్‌కుమార్‌ను కలిసి విషయం చెప్పాం. కేసీఆర్‌ను సంప్రదించి మాకు తెలంగాణ భవన్లో ఉండే అవకాశం ఇచ్చారు. ఆయనపై వాచ్ పెట్టాం.
దీక్ష ఏర్పాట్లను ఎలా పసిగట్టారు?
కేసీఆర్ నవంబర్ 27న హైదరాబాద్ నుంచి కరీంనగర్ ప్రయాణమయ్యారని సమాచారం తెలిసి కాన్వాయ్‌ని అనుసరిస్తూ వెళ్లాం. కరీంనగర్ తెలంగాణ భవన్లో మీటింగ్ తర్వాత.. దీక్షకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులకు చెప్పాం.
కేసీఆర్ అరెస్టు కోసమే శిక్షణ ఇచ్చారట?
కేసీఆర్ అరెస్టుకు ఒక బ్యాచ్‌కు శిక్షణ ఇచ్చేవారు. కరీంనగర్ నుంచి కాన్వాయ్‌తో సిద్దిపేటకు చేరుకొని, అక్కడే దీక్ష చేయాలనే కేసీఆర్ ఉద్దేశం తెలిసి స్పెషల్ టీమ్ కూడా కరీంనగర్ చేరుకున్నది.
కేసీఆర్‌పై దాడి వాస్తమేనా?
అప్పట్లో కేసీఆర్‌కు థ్రెట్ ఉన్నదనేది నిజమే. నాటి ఇంటెలిజెన్స్ ఐజీ ఒక బుల్లెట్ ప్రూఫ్ సుమో పంపారు. కేసీఆర్ సిద్దిపేటకు ఆ సుమోలోనే వెళ్తారని డిసైడ్ అయింది.
28నాటి పరిణామాలేంటి?
29న వెళ్తే అరెస్టు చేస్తారు కాబట్టి.. ఈరోజే (28న) వెళ్తారనే ప్రచారం జరిగింది. అరెస్టు చేయడానికి శిక్షణ బృందం వచ్చేసింది. నేను భవన్లోపలే ఉన్నా.. కేసీఆర్‌ను అరెస్టు చేస్తారేమోననే ప్రచారంతో కార్యకర్తలంతా చుట్టుముట్టారు. అక్కడ పోలీసులు ఉండకుండా తరిమికొట్టేశారు. గేట్లు లాక్ చేశారు.
మిమ్మల్ని ఎందుకు వదిలిపెట్టారు?
హడావుడి సమయంలోనే ఇద్దరు వచ్చి, ఈయన కూడా పోలీసే, తరిమికొట్టండి అన్నారు. ఆ మాటలకు నా ప్లాన్ బెడిసికొట్టుద్దేమో అనుకున్నా. వారిలో ఇంకొందరు ‘ఆయన మనసారే’ అనడంతో నా జోలికి రాలేదు.
29న ప్లాన్ ఏంటి?
తెల్లారేసరికి సిరిసిల్ల, కరీంనగర్, హుజూరాబాద్, సిద్దిపేట నుంచి వందల వాహనాలు వచ్చాయి. కేసీఆర్ కాన్వాయ్ బయలుదేరింది. ఐజీ పూర్ణచందర్రావు కాల్ చేశారు. ‘శ్రీధర్.. ఈ రోజు నువ్వు కేసీఆర్ కాన్వాయ్కి పైలెట్వి’ అన్నారు. ‘నీకు రూట్స్ తెలిసిన మంచి ఎస్సైని పంపిస్తా’ అని అంబటి నర్సయ్యను పంపారు.
కేసీఆర్ అరెస్టుకు ఎలా ప్లాన్ చేశారు?
సిద్దిపేట వెళ్లడానికి కరీంనగర్ దాటుతారు. కేసీఆర్ వెనుక ఉండే రోప్‌పార్టీ వాహనశ్రేణిని అడ్డుకోవాలి. సిద్దిపేట వెళ్తున్న క్రమంలోనే అల్గనూరు చౌరస్తాలో వరంగల్ వైపు కేసీఆర్‌ను తీసుకెళ్లాలనేది ప్రణాళిక.
ఆ ప్లాన్‌ను అమలు చేశారా?
మెయిన్ రోడ్డు ఎక్కాక ఊహించింది ఒకటి.. జరిగింది ఒకటి. సింగిల్ లైన్లో వెళ్తారేమో మా ప్లాన్ ఈజీ అవుతదని అనుకున్నాం. కొద్ది దూరం వెళ్లాక ఆయనే మళ్లీ అడిగారు. అదే పరిస్థితి, అంతకంటే ఎక్కువగానే ఉన్నదని చెప్పా. బండి దిగి నడిచేంత స్లోగా ఉన్నది. అంతలా కార్యకర్తలు మోహరించారని చెప్పా.
ఖమ్మం ఎందుకు తీసుకెళ్లారు?
అల్గునూర్ చౌరస్తా నుంచి కేసీఆర్‌ను మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోకి ఎక్కించుకొని ఖమ్మం సబ్ జైలుకు తరలించారు. ఆయనను అటాచ్ చేసి బయటికి వచ్చి ఐజీ పూర్ణచందర్‌రావుకు కాల్ చేశా. ‘సార్.. టాస్క్ కంప్లీట్ సార్’ అని చెప్తే ఆయన అభినందించారు.
తర్వాత కేసీఆర్‌ను ఎప్పుడైనా కలిశారా?
కొన్ని నెలల్లోనే కేసీఆర్ జహీరాబాద్ వస్తున్నారని తెలిసి బందోబస్తు పెట్టాం. ఆయన వస్తూ ఎవరు బందోబస్తు పెట్టారని అడిగారట. ఆయన పక్కన ఉన్నవాళ్లు ‘మీకు షాడోగా ఉండి, మిమ్మల్ని అరెస్టు చేసిన శ్రీధర్‌రెడ్డి’ అని చెప్పారట. నేను ఆయనతో నేరుగా మాట్లాడలేదు. ఆ తర్వాత కూడా సందర్భం, అవకాశం రాలేదు.
మరి ఎలా అరెస్టు చేశారు?
కరీంనగర్ మొత్తం పోలీసు బందోబస్తు ఉన్నది. చుట్టుపక్కల ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. కొంచెం దూరం వెళ్లాక అపోజిట్ రోడ్లో ఎలాంటి వాహనాలు రావడం లేదని గమనించా. అప్పటికే రెండుమార్గాల్లో ఉన్న వాహనశ్రేణి ఒకేలైన్కు వచ్చింది. కొంచెం ముందుకు వెళ్లగానే యూటర్న్ చూశా. అక్కడే మెరుపు ఆలోచన వచ్చింది. అదే రూట్లో మరొక యూటర్న్ వస్తుందనే ఆశతో ముందుకు వెళ్లాం. అప్పటికే మా సిబ్బందితో ‘వచ్చే యూటర్న్‌లో మనం రాంగ్ రూట్లోకి వెళ్తాం. అక్కడ్నుంచి కాన్వాయ్‌ని తప్పించి.. మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాం’ అని చెప్పా.
కార్యకర్తలు గమనించక ముందే ఒవర్టేక్ చేసి సిద్దిపేట రూట్లోకి వచ్చేసి, అదే వాయువేగంతో అల్గనూరు చౌరస్తాలోకి వెళ్లాం. అక్కడ మాకోసం సజ్జనార్ సార్, ఇక్బాల్ సార్ (ఇంటెలిజెన్స్ ఎస్పీలుగా) ఎదురుచూస్తున్నారు. ‘ముందు రావాల్సిన బండ్లు ఏవీ’ అని ఇక్బాల్ సార్ అడిగారు. ‘రాంగ్ రూట్లోంచి తీసుకొచ్చిన సార్’ అని చెప్పా. ‘ఎయ్.. నేను చెప్పానా.. అతను చేస్తాడని’ అని సజ్జనార్ అన్నారు. ఆ కారులో కేసీఆర్, ఆయనతో పాటు నాయిని నర్సింహారెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఇంకొందరు ఉన్నారు. ఆల్గనూరు చౌరస్తాలో కాసేపు నిరసన తెలిపినా తర్వాత అరెస్ట్ చేశాం.
పైలట్ అని ఎవరికి చెప్పారు?
కేటీఆర్‌కు కాల్ చేసి నన్ను పైలట్‌గా ఉంచారు. ‘40 నిమిషాల్లో బయలుదేరుతాం’ అని కేటీఆర్ చెప్పారు. 20 నిమిషాల్లో రెడీ అయి వచ్చా. కేసీఆర్ బయలుదేరకముందే అరెస్టు చేయాలని ఉన్నతాధికారులు చెప్పారు. టీఆర్ఎస్ వాళ్లు ఒప్పుకోలేదు. మేము మధ్యలో ఎక్కడైనా వాహనాన్ని ఆపితే.. వారు గుమికూడి కేసీఆర్ అరెస్టు కాకుండా చూడ్డానికి సిద్ధమయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

