Akshaya Tritiya | ముంబై, మే 10: బంగారం ధరలు రికార్డు స్థాయిల్లో పలుకుతున్నా.. అక్షయ తృతీయ అమ్మకాలు మాత్రం ప్రభావితం కాలేదు. గత ఏడాదితో పోల్చితే గోల్డ్ రేటు 15-17 శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ.. శుక్రవారం కొనుగోళ్లు బాగానే జరిగాయని దేశీయ రిటైల్ నగల వ్యాపారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈసారి అక్షయ తృతీయకు గోల్డ్ సేల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయని, ముఖ్యంగా తెలంగాణ తదితర దక్షిణాది రాష్ర్టాల్లో పుత్తడి విక్రయాలు పెద్ద ఎత్తున నమోదైనట్టు అఖిల భారత రత్నాలు, ఆభరణాల మండలి చైర్మన్ సైయం మెహ్రా పీటీఐకి తెలిపారు. ఈసారి తులం పసిడి రూ.71,000 పలుకగా, గత ఏడాది ఇదే సమయంలో రూ.60,000గానే ఉన్నది. కాగా, గురువారం నుంచి చూస్తే బంగారం ధర 10 గ్రాములు రూ.800 పెరిగిందని, ఇది అమ్మకాలను 5-7 శాతం దెబ్బ తీసిందన్న అభిప్రాయాన్ని మెహ్రా వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఓవరాల్‌గా ఈసారి సేల్స్ అంచనాలకు మించే జరిగాయని మెజారిటీ వ్యాపారులు చెప్తుండటం విశేషం. ఇక వెడ్డింగ్ జువెల్లరీ వంటి హెవీ వెయిట్ ఐటమ్స్‌కు దక్షిణాది మార్కెట్లో డిమాండ్ కనిపించినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఇది పెండ్లిళ్ల సీజన్ కానప్పటికీ పెరుగుతున్న ధరల దృష్ట్యా ఎక్కువ కుటుంబాలు భారీ డిజైన్ నగల కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇచ్చాయని మెహ్రా వివరించారు. అయితే ఉత్తరాది, మిగతా రాష్ర్టాల్లో తేలికపాటి ఆభరణాలకే ఆదరణ ఉన్నదన్నారు. ఈసారి అమ్మకాలపై ధరల ప్రభావం లేదని పీఎన్జీ జువెల్లర్స్ సీఎండీ సౌరభ్ అన్నారు. శనివారం మధ్యాహ్నం వరకూ అక్షయ తృతీయ సేల్స్ జరుగనున్నాయి.
ఢిల్లీలో ఈ ఒక్కరోజే 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.950 ఎగిసింది. స్పాట్ మార్కెట్లో రూ.73వేల మార్కుకు ఎగువన రూ.73,200గా నమోదైంది. కిలో వెండి ధర కూడా రూ.2,300 ఎగబాకి రూ.85,500 పలికింది. హైదరాబాద్‌లోనూ తులం 24 క్యారెట్ రేటు రూ.930 పుంజుకొని రూ.73,090గా ఉన్నది. 22 క్యారెట్ రూ.850 అందుకుని రూ.67,000గా ఉన్నది. కిలో వెండి ధర రూ.2,500 పెరిగి రూ.87,700ను తాకింది. ఇదిలా ఉంటే గత ఆర్థిక సంవత్సరం దేశంలోకి 45.54 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతులు జరిగాయి. గతంతో పోలిస్తే 30% పెరిగాయి.