Foods For Heart Health | నేటి తరుణంలో గుండె జబ్బుల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుందని చెప్పవచ్చు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వంటి వివిధ కారణాల వల్ల గుండె జబ్బుల బారిన పడే వారు ఎక్కువవుతున్నారు. దీంతో గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యల బారిన పడడంతో పాటు ప్రాణాలను కూడా కోల్పోయే పరిస్థితి నెలకొంది. కనుక గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా మంది తీసుకునే ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. సరైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాల్మన్, మాకేరెల్, సార్డిన్ వంటి చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మంటను తగ్గించి ట్రైగ్లిజరాయిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఆరోగ్యకరమైన గుండె లయకు కూడా ఇవి తోడ్పడతాయి. ఓట్స్ కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాలకూర, కాలే వంటి వాటితో పాటు ఇతర ఆకుకూరలను తీసుకోవడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించి ధమనుల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. అదే విధంగా బాదం, వాల్నట్స్, అవిసె గింజలు, చియా విత్తనాలు వంటి వాటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు వాపును తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో తోడ్పడతాయి.
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్బెర్రీ వంటి వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆక్సీకరణ ఒత్తిడిని నుండి కాపాడడంలో, రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో దోహదపడతాయి. ఆలివ్ ఆయిల్ లో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. ఈ విధంగా తగిన ఆహారాలను తీసుకుంటూ రోజూ వ్యాయామం చేయడం, ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవడం, శరీర బరువును అదుపులో ఉంచుకోవడం, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం వంటివి చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.